Sri Lanka | రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం శ్రీలంక(Sri Lanka) జైలును రావణకాష్టంలా మార్చిం ది. పరస్పర దాడుతో జైలు పరిసరాలు యుద్ధభూమిని తలపించాయి. శ్రీలంకలోని ఓ జైలులో జరిగిన ఘర్షణ ల్లో నలుగురు గార్డులతో సహా 23 మంది మరణించగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన దేశ రాజధాని కొలంబోకు ఉత్తరాన ఉన్న నెగొంబోలోని ప్రధాన జైలులో(Negombo prison) చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన విరాలు ఇలా ఉన్నాయి.
వేలాది మంది ఖైదీలు ఉన్న నెగొంబో జైలులో ఆదివారం సాయంత్రం రెండు డ్రగ్ ముఠాలకు చెందిన ఖైదీల మధ్య గొడవ ప్రారంభమై భౌతిక దాడులకు దిగారని తెలిపారు. జైలు సిబ్బంది క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరికి తుపాకీ గుండు గాయాలు కాగా, మరికొందరికి తీవ్రమైన దెబ్బలు తగిలాలయని హాస్పిటల్ డైరెక్టర్ పుష్ప గమ్లత్ తెలిపారు. కాగా, ఘర్షణలు జరుగుతున్న తరుణంలో పక్కనే విభాగంలో ఉన్న మహిళా ఖైదీలు అదే రాత్రి భయంతో జైలు పైకప్పుపైకి ఎక్కి తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం శ్రీలంక ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు కమాండోలను రంగంలోకి దించింది. జైలు ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి వైమానిక దళం డ్రోన్లు, హెలికాప్టర్‌ను మోహరించారు. విషయం తెలుసుకున్న ఖైదీల బంధువులు పెద్ద సంఖ్యలో జైలు బయట గుమిగూడారు. గత ఐదేళ్లకు పైగా కాలంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన జైలు అల్లర్లు ఇవేనని స్థానిక అధికారులు తెలిపారు.