చండీగఢ్: కొత్తగా పెళ్లైన ఒక వ్యక్తి భార్యను తన ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరూ కలిసి పిస్టల్‌లో కాల్పులు జరిపి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన ప్రేయసితో కలిసి పారిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు. (Man Kills Wife) హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. మానేసర్‌లో నివసించే 25 ఏళ్ల అంకిత్ స్థానికంగా పొగాకు షాపు నిర్వహిస్తున్నాడు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల రజనీ దేవి అదే ప్రాంతంలోని బ్యూటీ పార్లర్లో పనిచేసింది. దీంతో అంకిత్, రజనీ దేవి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా వారిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మానేసర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతితో అంకిత్‌కు పెళ్లి జరిగింది. అయితే వివాహమైన మూడు నెలలకే ఆమె అదృశ్యమైంది. మే 21న కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లి ఆందోళన చెందింది. అల్లుడు అంకిత్, అతడి కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు మే 22న రజనీ దేవి నివసిస్తున్న అద్దె ఇంట్లో ఆ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భర్త అంకిత్ తన భార్యను ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి ఆమెతో కలిసి కాల్చి చంపినట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత అంకిత్, రజనీ దేవి కలిసి తొలుత హరిద్వార్‌కు అక్కడి నుంచి నేపాల్‌కు పారిపోయినట్లు దర్యాప్తులో బయటపడింది.
అయితే జూన్ 30న ఆ జంట తిరిగి రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించారు. భార్యను హత్య చేసేందుకు ప్రియురాలు రజనీ దేవి నివసిస్తున్న అద్దె ఇంట్లో అంకిత్ కుట్ర పన్నాడని పోలీస్ అధికారి తెలిపారు. హత్యకు ఉపయోగించిన పిస్టల్‌ను ఉత్తరప్రదేశ్‌లో వారు కొనుగోలు చేసినట్లు చెప్పారు. అంకిత్, రజనీ దేవిని కోర్టులో హాజరుపర్చగా విచారణ కోసం పోలీస్ కస్టడీకి అప్పగించినట్లు పోలీస్ అధికారి వివరించారు. హత్యకు వాడిన ఆయుధం, ఇతర ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.