కారేపల్లి, జూలై 17 : గిరిజన మహిళలపై అటవీ అధికారుల దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకున్నది. మండలంలోని మాణిక్యారం-ఎర్రబోడు ఊటవాగు సమీపంలోని ప్లాంటేషన్ భూముల్లో పోడు సాగుదారులు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగిస్తుండగా వివాదం చోటుచేసుకున్నది. విత్తనాలు చల్లుకొని అక్కడే గుడిసెలు వేసుకొని జీవిస్తున్న తమపై అధికారులు దౌర్జన్యానికి దిగడం ఏమిటని గిరిజనులు నిలదీశారు.
ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఎఫ్‌డీవో ఐదు రోజుల్లో ఆ భూములపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, అయినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్లాంటేషన్‌లో గిరిజనులు పోడు సాగు చేపట్టారు. అటవీ శాఖ రేంజర్ కార్యాలయం నుంచి చర్చలకు రావాలని పిలుపు రావడంతో ప్రజా సంఘాల నాయకులతో కలిసి గిరిజనులు పోడు భూముల వద్దకు చేరుకున్నారు. పోడుదారులతో చర్చలు జరపకుండానే ఎఫ్ఆర్వో, ఎఫ్‌ఎస్‌వోలు చక్రవర్తి, వీరభద్రం ఆధ్వర్యంలో అధికారులు ప్లాంటేషన్‌కు చేరుకొని అక్కడున్న గుడిసెలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. సిబ్బందిని మహిళలు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో కరపతి అరుణ, మల్లమ్మను అటవీ అధికారులు నెట్టేయడంతో ఉద్రిక్తతకు దారితీసిం ది. ప్రజా సంఘాల నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అటవీ శాఖ అధికారులు మహిళలపై దౌర్జన్యానికి దిగారు. విషయం తెలుసుకున్న కారేపల్లి ఎస్సై బీ గోపి ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. జరిగిన విషయాన్ని అటవీ శాఖ డివిజన్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్య పరిష్కారానికి అధికారులు రెండు రోజుల గడువు కోరారు. గొడవ విషయమై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.