అశ్వాపురం, జూలై 18 : అటవీ అధికారులు ట్రెంచ్ పనులు చేస్తుండగా వలస ఆదివాసీ గిరిజనులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో అధికారురులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి చెదరగొట్టడంతో పలువురు గిరిజన మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడు పంచాయతీ పరిధి వేములూరులో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. వేములూరు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు తమ సిబ్బందితో కలిసి ట్రెంచ్ పనులు చేపట్టారు. కొందరు వలస ఆదివాసీ గిరిజనులు అక్కడికి చేరుకొని అధికారులు చేపట్టిన పనులను అడ్డుకున్నారు.
ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి గొడవకు దారితీసింది. దీంతో అటవీ అధికారులు గిరిజనులను ఈడ్చుకెళ్లారు. మరికొందరిని చెదరగొట్టారు. ఈ క్రమంలో మడకం గంగమ్మ స్పృహ కోల్పోగా.. సోడె పాయమ్మ, కణితి సారమ్మ, మడకం సీతమ్మ, సవలం జ్యోతిలకు స్వల్ప గాయాలయ్యాయి. పోడుదారుల ఆధీనంలో ఉన్న భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడమే పోడు వివాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేములూరులో అటవీ భూమి ఆక్రమణకు యత్నించడమే కాకుండా తమ విధులను ఆటంకపరిచిన పది మందిపై కేసు నమోదు చేసినట్టు ఎఫ్డీవో బాబు తెలిపారు.