Amrabad Forest | హైదరాబాద్, జనవరి 16 (నమస్తేతెలంగాణ): టెరిటోరియల్ అడివిని నరికి టైగర్ రిజర్వ్ ఫారెస్టు బాధితులకు పునరావాసం కల్పించాలని రాష్ట్ర అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని బాచారం టెరిటోరియల్ అడవిని డీనోటిఫై చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సుమారు 1500 హెక్టార్లలో ఉన్న తుప్పలు, పొదలు, చెట్లను తొలగించి, భూమిని సాగుయోగ్యంగా మార్చేందుకు అనుమతించాలని అటవీశాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు. మరోవైపు చెట్ల తొలగింపుపై పర్యావరణ, సామాజికవేత్తలు అభ్యంతరం చెప్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి 1,253 కుటుంబాలను రెండు దశల్లో తరలించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, తాటిగండ్ల గ్రామాల నుంచి 417 మంది చెంచేతర కు టుంబాలను పెద్దకొత్తపల్లి మండలం బచారం టెరిటోరియల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు తరలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రెండో దశ లో 836 కుటుంబాలను చెంచు కుటుంబాల ను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రణాళిక రూ పొందించారు. మొదటి దశ తరలింపు కోసం రూ.55 కోట్లు, రెండో దశ తరలింపు కోసం రూ.100 కోట్లు ఖర్చవుతాయని అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు.
టైగర్ రిజర్వ్ ఏరియా నుంచి బయటికి వెళ్లేందకు ఆసక్తి చూపిస్తున్న 417 కుటుంబాలు వ్యవసాయ భూమలు కావాలని డి మాండ్ చేస్తున్నాయి. కానీ ఇన్ని కుటుంబాల కు కావాల్సిన భూమి రెవెన్యూశాఖ నుంచి ల భ్యం కావటంలేదు. పులి సంచారం లేని, తు ప్పలు, పొదలతో నిండిన టెరిటోరియల్ ఫా రెస్టు భూమినే బాధితులకు ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించింది. బాచారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 1500 హెక్టార్ల భూమిని గుర్తించిం ది. రిజర్వ్ ఫారెస్ట్ భూములను డీనోటిఫై చే యాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. భూమిని సాగుయోగ్యంగా మార్చేందుకు సుమారు 1.3 లక్షల తుప్పలు, పొదలు, చెట్లు తొలగించాలని, పులి సంచారం లేని ప్రాంతం కాబట్టి వాటి తొలగింపునకు అనుమతివ్వాలని కోరింది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర అటవీశాఖ నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.
గ్రామాల తరలింపు, పునరావాసంపై అటవీశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశాలను నిర్వహించారు. రాష్ట్ర కమిటీ కూడా ఆమోదించింది. ఏటీఆర్‌లో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున, ప్రధాన ప్రాంతాల నుంచి గ్రామాల తరలింపు అనివార్యంగా మారిందని అధికారులు చెప్తున్నారు. మానవ-వన్యప్రాణుల సంఘర్షణ, జీవవైవిధ్యం అభివృద్ధి, స్థానిక నివాసితుల సంక్షేమం దృష్ట్యా తరలింపు చేపడుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అడవిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న చెంచులను అక్కడి నుంచి బలవంతంగా తరలిస్తే వారి జీవనం దెబ్బతింటుందని పలువురు సామాజిక వేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పులులకు, చెంచులకు మధ్య వైరమే లేదు. అడవి, చెంచులు వేర్వేరు కాదు. చెంచుల ఆవాసమే నల్లమల అడవి. తల్లి తావు నుంచి గిరిజనులను వేరు చేయవద్దు. భూగర్భ వనరులను వెలికితీసే కుట్రలతో పాలకులు చెంచులను అడవికి దూరం చేస్తున్నారు. నల్లమలలో యురేనియం నిక్షేపాలను వెలికి తీయవద్దని గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం తీర్మానం చేసి, కేంద్రానికి పంపింది.
బాచారంలో పునరావాస కాలనీల ఏ ర్పాటు పేరుతో లక్ష చెట్లను తొలగించడం పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతుంది. ఇష్టానుసారంగా చెట్లను తొలగించడంతో ములుగులో లక్ష చెట్లు నేలమట్టమయ్యాయి. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌ను టైగర్ కారిడార్ పేరుతో చెంచులను తరలించడం కన్నా ప్రస్తుతం ఉన్న కారిడార్‌ను కాపాడితే సరిపోతుంది.