NTCA | హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): పొగిళ్ల.. ఒకనాటి నాగార్జునసాగర్ ముంపు గ్రామం. 60 ఏండ్ల క్రితం కట్టుబట్టలతో వచ్చి రాళ్లు, రప్పలు తొలగించుకుని గుడిసెలు వేసుకున్న గ్రామస్తులు మళ్లీ కలవరపడుతున్నారు. నాగార్జునసాగర్ జలాలతో రెండువేల ఎకరాలు సాగు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్న పొగిళ్లవాసులు పొట్టచేతపట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. దేశంలో పెద్దపులుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం అడవి లోపల ఉండే పొగిళ్ల, రేకుల వలయం గ్రామాలను జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్ టీసీఏ) స్వచ్ఛంద గ్రామ తరలింపు కార్యక్రమం (వీవీఆర్పీ) కింద మైదాన ప్రాంతానికి తరలించేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం పొగిళ్లలో రెండు వేల జనాభా ఉండగా 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
ఇకడి రైతులు నాగార్జునసాగర్ వెనుక జలాల నుంచి 5 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేసుకొని రెండు వేల ఎకరాల్లో పంటలను సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాన్ని అటవీశాఖ అధికారులు ఖాళీ చేయమంటుండడంతో అందరి పరిస్థితీ అయోమయంగా మారిందనీ గ్రామస్తులు వాపోతున్నారు. పొగిళ్ల ప్రాంతం అమ్రాబాద్ పులుల అభయారణ్యం కావడంతో ఇక్క డ పులుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. వాటి బారి నుంచి గ్రామస్థులను కాపాడేందుకు.. గ్రామాన్ని అభయారణ్యంలో విలీనం చేసి వారిని సేఫ్ జోన్కు తరలించేందుకు అటవీశాఖ అధికారులు గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. దేవరకొండ సమీపంలోని ముదిగొండ వద్ద పునరావాసం కల్పిస్తామని చెబుతున్నారు. భూ మికి బదులు భూమి, ఇండ్లు, 18 ఏళ్లకు పైబడిన వారికి తగిన ఉద్యోగాలు, వసతులు కల్పిస్తామని చెప్పారు. నాడు సాగర్ ముంపు బాధితులుగా, నేడు పులుల సంరక్షణ పేరుతో మరో ప్రాంతానికి తరలింపు ప్రతిపాదనతో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని పొగిళ్లవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.