హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): నేర పరిశోధనను పటిష్టం చేయడానికి ఖమ్మం, మంచిర్యాలలో కొత్తగా రీజినల్ ఫోరెన్సిక్ లాబొరేటరీలను ఏర్పాటుచేసినట్టు ఫోరెన్సిక్ సైన్స్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ల్యాబ్లు శుక్రవారం నుంచి తమ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయని వెల్లడించారు. టాక్సికాలజీ, బయాలజీ/సెరోలజీ విభాగాల కేసులను త్వరగా పరిష్కరించడానికి ఈ ల్యాబ్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్షల ఫీజు రెట్టింపు?
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజును పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 100 శాతం మేర ఫీజులు పెంచాలని అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు రూ.500 ఫీజు వసూలు చేస్తుండగా, దానిని వెయ్యికి పెంచనున్నట్టు సమాచారం.
ఆవిష్కరణలకు టీహబ్ ప్రోత్సాహం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీహబ్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మెర్సిడెజ్ బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియాతో కలిసి స్టూడెంట్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ చేపట్టింది. సస్టెయినబిలిటీ, ఎన్విరాన్మెంటల్ సస్టెయినబిలిటీ అంశాల్లో ఆవిష్కరణల కార్యక్రమం చేపట్టింది.