హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): అసలు సిసలైన హిందూ ధర్మ పరిరక్షకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించటమే కాకుండా అనేక ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. బ్రాహ్మణులు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారని, వారి సంక్షేమాన్ని కాంక్షించి అవసరమైన సహకారం ముఖ్యమంత్రి అందిస్తున్నారని వెల్లడించారు. సీఎం బ్రాహ్మణ బంధు అని స్పష్టం చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో సోమవారం బొగ్గులకుంటలోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో బ్రాహ్మణ విద్యార్థులకు వివేకానంద విదేశీ విద్యా పథకం మంజూరు పత్రాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొందరు ఇతర మతాల పట్ల విద్వేషాలు రెచ్చగొడుతూ, తామే అసలైన హిందూ ధర్మ పరిరక్షకులమని చెప్పుకొంటారని, అలాంటివారు తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు అమలు చేయటం లేదని బీజేపీని ఉద్దేశించి నిలదీశారు. సీఎం కేసీఆర్‌కు స్వతహాగానే గురువులపై, దేవుడిపై అపారమైన భక్తి విశ్వాసాలుంటాయని పేర్కొంటూ, 1986-87లో సిద్దిపేటలో అధికారులతో పోరాడి నిధులు మంజూరు చేయించి బ్రాహ్మణ భవనం నిర్మించారని గుర్తుచేశారు.
ఆలయాల అభివృద్ధికి విరివిగా నిధులు
ఆలయాల నిధులను గతంలో ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణం వంటి ఇతర పనుల కోసం ఉపయోగించేవని, కానీ కేసీఆర్ సర్కారు మాత్రం ఆలయాలకే నిధులను ఇస్తున్నదని హరీశ్‌రావు తెలిపారు. రూ.1,100 కోట్లతో యాదగిరిగుట్ట పునర్నిర్మాణంతో పాటు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, బాన్సువాడ, భద్రాద్రి, బాసర తదితర అనేక ఆలయాల అభివృద్ధికి నిధులు ఖర్చు చేస్తున్నారని వివరించారు. దేవాదాయ శాఖకు బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయిస్తున్న ఏకైక నేత కేసీఆర్ అని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు, సీఎంలు బ్రాహ్మణులు, వైశ్యులు వంటి ఉన్నత వర్గాల గురించి ఆలోచించే ధైర్యం చేసేవారు కాదని, కానీ, సంక్షేమ కార్యక్రమాలకు పేదరికమే ప్రామాణికం కావాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. విదేశీ విద్యా పథక లబ్ధిదారులు బాగా చదువుకొని రాష్ట్రంపేరు నిలబెట్టాలని సూచించారు.
నిఖార్సయిన అధికారి రమణాచారి
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారిని తాము ప్రేమతో రమణన్న అని పిలుచుకొంటామని, సిద్దిపేట వాసి కనుక ఆయనకు తమపై హక్కు, అధికారం ఉంటాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కొండపాకలో వృద్ధాశ్రమాన్ని నిర్మించి ఎందరికో వసతి కల్పిస్తున్నారని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ గొప్ప ఆలయాన్ని, దవాఖానను నిర్మిస్తున్నారని వెల్లడించారు. రమణాచారికి కళాకారులంటే ఎంతో ప్రేమని, సురభి కళాకారుల దయనీయస్థితిని వివరిస్తూ వారికి ఇస్తున్న పెన్షన్‌ను రూ.1,500 నుంచి రూ.3,000కు పెంచేవరకు తన వెంటపడ్డారని గుర్తుచేశారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ మాట్లాడుతు బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. పేద బ్రాహ్మణుల సామూహిక ఉపనయనాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించాలని, దహన సంస్కారాలకు రూ.15,000 అందించే పథకాన్ని పునరుద్ధరించాలని, ఎన్టీఆర్ హయాంలో రద్దుచేసిన ఆనువంశిక అర్చక వ్యవస్థను పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న రూ.28.60 కోట్లు విడుదల చేయాలని విన్నవించారు. వీటిపై ముఖ్యమంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకొంటామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
కేసీఆర్ అనుగ్రహంతోనే బ్రాహ్మణుల సంక్షేమం: రమణాచారి
ప్రభుత్వ సేవల్లో 50 ఏండ్లు ఉన్నా బ్రాహ్మణుల కోసం ఏమీ చేయలేకపోయానని, సీఎం కేసీఆర్ అనుగ్రహంతో నేడు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా సేవలు అందించే భాగ్యం కలిగిందని రమణాచారి తెలిపారు. ఇప్పటి వరకు విదేశీ విద్యా పథకం ద్వారా 738 మంది బ్రాహ్మణ విద్యార్థులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. వచ్చే నెలలో మరో 100 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు పాలనాధికారి రఘురామశర్మ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి, సీఎం కార్యాలయ పీఆర్వో జ్వాలా నరసింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, దేవీప్రసాద్, మృత్యుంజయశర్మ, దర్శనం వెంకటరమణ శర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య గౌరవాధ్యక్షుడు ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.
కలలోనూ ఊహించలేదు
మా కుమారుడిని విదేశాలకు పంపించి ఉన్నతవిద్య చదివిస్తామో లేదో అనుకొన్నాం. వివేకానంద విదేశీ విద్యా పథకంతో పేద బ్రాహ్మణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. రూ.20 లక్షల రుణం దొరకడం అసాధ్యమని భావించాం. సీఎం కేసీఆర్ వల్ల మాలాంటి పేద కుటుంబాలకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించింది.
-ఆర్వీఎస్ చంద్రమౌళి, కొత్తపేట
సీఎం కేసీఆర్ ఆదుకొన్నారు
నాన్న చనిపోవడంతో మా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నది. ఎక్కడా రుణాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తమ్ముడు కౌశిక్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సి రావడంతో రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. ఇంటి పెద్దదిక్కుగా సీఎం కేసీఆర్ నిలబడి విదేశీ విద్యాపథకం ద్వారా తమను ఆదుకొన్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-సాయి, కౌశిక్ సోదరి, సికింద్రాబాద్