హైదరాబాద్, అక్టోబర్29 (నమస్తే తెలంగాణ): విదేశీ విద్యానిధి పథకం స్కాలర్షిప్ బకాయిలు ఎట్టకేలకు విడుదల కానున్నాయి. 2022 నుంచి నేటివరకు రూ.303 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ విద్యార్థుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓవర్సీస్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఏటా వేలాది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం ఓవర్సీస్ పథకానికి నిధుల విడుదలను నిలిపేసింది. అభ్యర్థులను ఎంపిక చేయడం మినహా ఇప్పటి వరకూ నిధులను విడుదల చేయనేలేదు. మొత్తంగా ఈ పథకానికి ఇప్పటివరకూ రూ.303 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
ఆ నిధులను చెల్లించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రెండేండ్లుగా మొరపెట్టుకుంటున్నారు. ఓవర్సీస్ సాలర్షిప్పై ఆధారపడి విదేశాలకు వెళ్లిన పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాల్లో గతంలో మాదిరిగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేకపోవడం, ఇక్కడ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇదే విషయమై ‘విదేశీ విద్యానిధి పథకం.. ఎంపికలకే పరిమితం’ పేరిట నమస్తే తెలంగాణ ఇటీవల ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించింది.