హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : టీఏ లేదు, డీఏ లేదు, హెచ్ఆర్ఏ అంతకన్నా లేదు.. అయినప్పటికీ హోంగార్డులు కచ్చితంగా బదిలీ కావాల్సిందేనని కొన్నేండ్లుగా పోలీసుశాఖ ఆదేశాలిస్తూనే ఉంది. తాజాగా ‘ఆర్డర్ టు సర్వ్’ కింద జనరల్ (పోలీసుశాఖ), జనరల్ క్యాటగిరీలో పనిచేస్తున్న అదర్ డిపార్ట్మెంట్ (ఓడీ) హోంగార్డులు ఏయే జిల్లాలకు వెళ్తారో చెప్పే విల్లింగ్ లెటర్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీచేసింది. లేకపోతే జిల్లా ఎస్పీ ఆఫీసు నుంచి ఎవరెవర్ని ఏయే జిల్లాకు పంపుతారో కూడా తెల్వదని, కాబట్టి ముందుగానే విల్లింగ్ లెటర్ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఉదాహరణకు ఆదిలాబాద్‌లో రెండేండ్లు, అంతకు ముందునుంచీ పనిచేస్తున్నవారు తప్పకుండ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఏ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారో కూడా తెల్వదు. దీంతో జనరల్ డ్యూటీల్లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల్లో భయం పట్టుకుంది.
ప్రతియేటా ఇలా దూర ప్రాంతాలకు బదిలీలు చేస్తుండటంతో హోంగార్డులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీఏ లేదు, డీఏ లేదు, హెచ్ఆర్ఏ లేకపోయినా సొంత ఖర్చులతోనే అంతంత దూరం ప్రయాణం చేస్తున్నామని వాపోతున్నారు. కుటుంబం ఒకచోట స్థిరపడినప్పుడు పిల్లల చదువులు, తల్లిదండ్రుల ఆరోగ్యం రీత్యా జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉంటూ.. అంతదూరం ప్రయాణించాల్సి వస్తుందని అంటున్నారు. సరైన నిద్రలేక, మానసిక ఒత్తిడికి లోనై, తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వాపోతున్నారు. ఆర్డర్ టు సర్వ్ కింద జరిగే ఈ బదిలీలతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయని, జీతం డబ్బుల్లో సగం ప్రయాణాలకు అయిపోతున్నాయని అంటున్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా.. శాశ్వత పరిషార దిశగా ఆలోచన చేయడం లేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 90 రోజుల్లో హోంగార్డుల సమస్యలు పరిషరిస్తామని నాటి పీసీసీ అధ్యక్షుడిగా హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. సీఎం అయ్యాక తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు సిబ్బంది కొరత కారణంగా ‘ఆర్డర్ టు సర్వ్’ ద్వారా హోంగార్డులను కూడా ఇతర జిల్లాలకు పంపారు. ఇప్పుడు అన్ని స్టేషన్లకు కొత్తగా కానిస్టేబుళ్లను నియమించుకున్నా అదే విధానంలో హోంగార్డులను దూరప్రాంతాలకు పంపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్‌కు 60 మంది హోంగార్డులు 80 కిలోమీటర్లు నిత్యం ప్రయాణించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఇలా ఆసిఫాబాద్‌కు 40 మంది 130 కిలోమీటర్లు, ఉమ్మడి నల్లగొండ నుంచి సూర్యాపేట జిల్లాకు 40 మంది 55 కిలోమీటర్లు, ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లా నుంచి గద్వాల్‌కు 55 మంది 120 కిలోమీటర్లు, వనపర్తికి 35 మంది 60 కిలోమీటర్లు, నారాయణపేటకు 70 మంది 75 కిలోమీటర్లు, మెదక్ సంగారెడ్డి నుంచి 60 మంది సిద్దిపేటకు 120 కిలోమీటర్లు, ఉమ్మడి నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 42 మంది 75 కిలోమీటర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, రామగుండం కమిషనరేట్, భూపాలపల్లి, వరంగల్, సిద్దిపేటకు 300 మందిని ప్రతి సంవత్సరం రొటేషన్ పద్ధతిలో పంపిస్తున్నారని వాపోతున్నారు.