హైదరాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖ అనుబంధ కార్పొరేషన్లలో కొంత మంది అధికారుల గుత్తాధిపత్యం కొనసాగుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఏడు, ఎనిమిదేండ్లుగా ఒకే విభాగంలో విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. ఎంత మంది ఎండీలు మారినా వారి సీటుకు మాత్రం ఢోకా ఉండదు. ‘చంటిగాడు లోకల్’ అనేలా ఎండీలు వస్తుంటారు.. పోతుంటారు గానీ వారు మాత్రం అక్కడే ఉంటారు. వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లన్నింటిలోనూ 70-80% ఉద్యోగులు లాంగ్ స్టాండింగ్‌లోనే ఉన్నట్టుగా తెలిసింది. సాధారణ బదిలీలను కార్పొరేషన్లకు వర్తింపజేయకపోవడం, ఆ తర్వాత కార్పొరేషన్ల ఎండీలు ఉద్యోగులను బదిలీ చేయకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారయ్యిం ది. వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్లు ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా, ఆగ్రోస్, గిడ్డంగుల కార్పొరేషన్, సీడ్ కార్పొరేషన్ల్లో ఈ తతంగం జోరుగా జరుగుతున్నది. చాలా ఏండ్ల తర్వాత మార్క్‌ఫెడ్‌లో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. లాంగ్‌స్టాండింగ్ పేరుతో ఒకేసారి 13 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మిగతా కార్పొరేషన్లలో ఉద్యోగుల బదిలీలపై చర్చ జరుగుతున్నది.
ఉన్నతాధికారులతో మిలాఖత్ !
కార్పొరేషన్లలో నాలుగైదేండ్లుగా బదిలీలు నిర్వహించలేదు. 2024 జూలైలో జరిగిన సా ధారణ బదిలీ పరిధిలోకి కార్పొరేషన్లు రావనే సాకుతో నాడు బదిలీలు చేపట్టలేదు. దీంతో ఉద్యోగులు ఏండ్లకు ఏండ్లు ఒకేచోట పాతుకుపోయారు. దీని వెనుక ఉన్నతాధికారుల స్వార్థప్రయోజనాలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి కార్పొరేషన్లో కీలక విభాగాలకు సంబంధించిన ఉద్యోగులను సదరు కార్పొరేషన్ల ఉన్నతాధికారులు టచ్ చేసే పరిస్థితి కూడా లేదనే విమర్శలున్నాయి. ఇందుకు సదరు ఉద్యోగులు, ఉన్నతాధికారుల మధ్య ఆర్థిక సంబంధాలే కారణమనే ఆరోపణలున్నాయి. దీంతో కార్పొరేషన్లకు ఉన్నతాధికారులు మారినప్పటికీ ఆ కీలక విభాగాల్లోని అధికారులు మాత్రం బదిలీకారు. ఉన్నతాధికారులు ఎవరొచ్చినా సరే వారితో మిలాఖత్ కావడం, పంపకాలు చేసుకోవడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అప్పుల్లో కార్పొరేషన్లు.. కోట్లకు పడగలెత్తుతున్న ఉద్యోగులు ?
వ్యవసాయ కార్పొరేషన్లలో ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్, గిడ్డంగుల కార్పొరేషన్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిగిలిన కార్పొరేషన్లల్లో ఏ రోజుకు ఆ రోజు అన్నట్టుగానే ఆర్థిక పరిస్థితి ఉన్నది. ప్రతి నెలా సంస్థ ఉద్యోగుల వేతనాలకు కూడా పైసా పైసా వెతుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి నెలకొన్నది. ఆర్థిక కష్టాలు కార్పొరేషన్లకే కానీ.. అందులో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులకు కాదనే విమర్శలున్నాయి. ఓవైపు కార్పొరేషన్లు అప్పుల్లో కూరుకుపోతుంటే.. ఉద్యోగులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్ల రూపంలో వచ్చిన అవినీతి సొమ్ము తో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కూడబెట్టినట్టు చర్చ జరుగుతున్నది. కింది నుంచి పైస్థాయి వరకు అంతా కూడబలుక్కొన్ని కమీషన్లు పుచ్చుకుంటూ వాటాలు పంచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికీ, ప్రతి బిల్లుకూ కమీషన్లు ముట్టజెప్పాల్సిందేనని, లేదంటే ఫైల్ కదలదు.. బిల్లు రాదనే పరిస్థితి నెలకొన్నదనే విమర్శలున్నాయి.
మార్క్‌ఫెడ్‌కే పరిమితమా..? మంత్రి ముందడుగు వేసేనా ..?
వ్యవసాయ శాఖలో ఉద్యోగుల బదిలీల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఇందుకు కారణం రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్ మార్క్‌ఫెడ్‌లో చాలా ఏండ్ల తర్వాత ఉద్యోగులను బదిలీ చేయడమే. మంత్రి తుమ్మల ఆదేశాలతో మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి ఒకేసారి 13 మంది అధికారులను బదిలీ చేశారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్పొరేషన్ ఉద్యోగుల బదిలీల నిర్ణయాన్ని ఒక్క మార్క్‌ఫెడ్‌కే వర్తింపజేస్తారా..? లేక మిగిలిన కార్పొరేషన్లకు కూడా వర్తింపజేస్తారా..? అనే చర్చ జరుగుతున్నది.