ఉమ్మడి పాలనలో ఆత్మగౌరవం దక్కక.. విధి నిర్వహణలో అవహేళనలు, ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానాలు ఎదుర్కొన్న ఉద్యోగులు తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రధాన భూమిక పోషించారు. ఉద్యోగ సంఘాలన్నింటినీ ఏకం చేసి జేఏసీగా ఏర్పడి రాజకీయ పార్టీలతో సమానంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. పెన్‌డౌన్‌లు, నల్లబ్యాడ్జీలతో నిరసనలను కొనసాగించడమే కాకుండా సకలజనుల సమ్మెలో కీలకపాత్ర వహించారు. పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్, చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఇతర డిమాండ్లను పరిష్కరించారు. పదేండ్లపాటు ఫ్రెండ్లీ గవర్నమెంట్‌తో స్వర్ణయుగాన్ని చూసిన ఉద్యోగులు, గత ఎన్నికల్లో తమకు హామీలిచ్చి మరిచిన కాంగ్రెస్ సర్కార్‌పై జంగ్ సైరన్ మోగించేందుకు సిద్ధమయ్యారు.
Employees JAC | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : తమతో వెంటనే చర్చించి, సమస్యలు పరిష్కరించకుంటే రేవంత్ సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటామని రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంపై గుర్రుగా ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జేఏసీగా ఆవిర్భవించాయి. సోమవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఎంప్లాయీస్ జేఏసీ ఆవిర్భావ సమావేశం జరిగింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, టీచర్, ఔట్సోర్సింగ్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన 53 సంఘాలు సమావేశానికి హాజరై జేఏసీలో భాగస్వామ్యమయ్యాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించి మొత్తం 36 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వీటి పరిష్కారానికి చొరవ చూపాలని, లేదంటే 15 రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటిస్తామని అల్టిమేటం జారీచేసింది. సర్కారు స్పందించి వెంటనే తమను చర్చలకు పిలవాలని లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించింది. టీఈజేఏసీ ఆవిర్భావంతో పాటు 15 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న పీఆర్టీయూ టీజీ సైతం ఇదే జేఏసీలో భాగస్వామ్యమైంది. ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ సైతం ఎంప్లాయీస్ జేఏసీ సమావేశానికి హాజరయ్యారు.
టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేని, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ, గ్రూప్ -1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి, ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ట్రెసా ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ, తాహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, టీఆర్టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, టీటీయూ అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, టీపీటీయూ అధ్యక్షుడు రాధాకృష్ణ, వీఆర్వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
మమ్మల్ని పిలిచిన..చర్చించిన దాఖలాల్లేవు
ఉద్యోగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసమే జేఏసీగా ఏర్పడ్డాం. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 15 రోజుల్లోనే పెండిగ్ డీఏలు విడుదల చేస్తామని చెప్పారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారు. సీపీఎస్‌ను రద్దుచేస్తామన్నారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని హామీనిచ్చి మ్యానిఫెస్టోలో పెట్టారు. 9 నెలలు కావొస్తున్నా ఒక్కటంటే ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. గతంలో రెండు డీఏలు పెండింగ్‌లో ఉంటేనే సమ్మెకు దిగిన సందర్భాలున్నాయి. ఇప్పుడు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరో డీఏను సర్కారు త్వరలోనే బాకీ పడబోతున్నది. ఇది ఉద్యోగులు తెచ్చిన ప్రభుత్వమని రేవంత్‌రెడ్డి పలుమార్లు అన్నారు. కానీ, ఇంతవరకు ఉద్యోగులను పిలిచి సమస్యలపై చర్చించిన దాఖలాలేవు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి అన్ని సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలి. లేదంటే రాబోయే 10 -15 రోజుల్లో జేఏసీని పటిష్టంచేసి, జిల్లాలు తిరిగి మా కార్యాచరణ ప్రకటిస్తాం. మరో ఉద్యమానికి పిలుపునిస్తాం. ముందుగా జిల్లాల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కార సభలు నిర్వహిస్తాం. ఆ తర్వాత నల్లబ్యాడ్జీలతో నిరసనలు, మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలుంటాయి. అయినా ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు ప్రభుత్వం అన్యాయం తలపెడితే ఏ ఉద్యమానికైనా మేం సిద్ధమే.
– మారం జగదీశ్వర్,ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్
ఒకటో తేదీన కొన్నిశాఖల్లో జీతం వస్తలేదు
ఉద్యోగులకు సంబంధించి వందల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఆగస్టు 15 తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని, మమ్మల్ని చర్చలకు పిలుస్తామని మౌఖికంగా ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. సమయం దగ్గరపడుతున్నదని కాబట్టి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు అనుసరిస్తున్న ఈ కుబేర్, టోకెన్ విధానాన్ని రద్దుచేయాలి. కొత్త ప్రభుత్వంలో మొదటి తేదీనే జీతాలిస్తామన్నారు. కానీ కొన్ని శాఖల్లో మొదటి తేదీన జీతాలు రావడంలేదు. ఐకేపీ, అంగన్వాడీ, ఆశ, ఈజీఎస్ ఉద్యోగులంతా ఏకమయ్యాం. మేమంతా జేఏసీగా ఏర్పడ్డామంటేనే మా కార్యాచరణ రూపొందిస్తున్నామని అర్థం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు, సర్వీస్ రూల్స్ ఏర్పాటుతో సగం సమస్యలు, సీఎస్‌తో సమావేశం పెడితే మరో సగం సమస్యలు పరిష్కారమవుతాయి. జేఏసీని చర్చలకు పిలిస్తే అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. మా న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.
– ఏలూరి శ్రీనివాస్‌రావు, ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్
ఏకీకృత సర్వీస్‌రూల్స్ రూపొందించాలి
సీపీఎస్ రద్దు సహా టీచర్ల అనేక పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. అత్యంత కీలకమైన ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూపొందించాలి. మోడల్ స్కూల్, ఎయిడెడ్, గురుకుల టీచర్లకు ఒకటో తేదీన జీతాలు అందడంలేదు. వీరికి 010 పద్దు ద్వారా వేతనాలివ్వాలి. సమగ్రశిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.
– పింగిలి శ్రీపాల్‌రెడ్డి,పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
తక్షణమే కొత్త పీఆర్సీ వేయాలి
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ నాంది పలికింది. ఉమ్మడి ఏపీలో పనిచేసినట్టుగానే జేఏసీ మరింత ప్రభావశీలంగా పనిచేయాల్సిన అవసరమున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక వాగ్దానాలిచ్చారు. అనేక సమస్యలు పరిష్కరిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారు. వాటిని ప్రభుత్వం పరిష్కరించే దిశగా చొరవచూపాలి. పీఆర్సీ గడువు ముగిసి 13 నెలలైంది. తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని కొత్త పీఆర్సీ వేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
– చావ రవి, టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
విద్యారంగాన్ని గాడినపెట్టాలి
టీచర్ల బదిలీలు, పదోన్నలిచ్చారు సంతోషం. కానీ ఇంకా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యారంగాన్ని ప్రభుత్వం గాడినపెట్టాలి. విద్యాశాఖ సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఉండటం, ఇతర పనుల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉండటంతో విద్యాశాఖకు సంబంధించిన అనేక ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే విద్యాశాఖను సీఎం వదిలించుకుని ప్రత్యేక మంత్రికి కేటాయించాలి.
-వై అశోక్‌కుమార్,టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
భవిష్యత్తు కార్యాచరణ అవసరం
ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణ అవసరం. అనేక మండలాలకు ఎంఈవోలు లేరు. ఆరేడు మండలాలకో ఎంఈవో చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. జూనియర్ లెక్చరర్, బీఈడీ, డైట్ కాలేజీ లెక్చరర్ పదోన్నతులు కల్పించాలి. అన్ని జిల్లాలకు డీఈవోలు లేరు. ఇన్చార్జిలతో కాలం వెల్లదీస్తున్నారు. పాఠశాలల పర్యవేక్షణ దెబ్బతింటున్నది. అన్ని జిల్లాలకు రెగ్యులర్ డీఈవోలను నియమించాలి.
– సదానందంగౌడ్,ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కారుణ్య నియామకాలు చేపట్టాలి
ఎన్నికల సమయంలో రెవెన్యూశాఖలో బదిలీలు చేపట్టారు. ఎన్నికలు ముగియగానే వారిని వెనక్కి తీసుకురావాల్సి ఉండె. తహసీల్దార్లతో పాటు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లను ఒక జిల్లాలో పనిచేస్తున్న వారిని మరో జిల్లాకు బదిలీచేశారు. ఇతర శాఖల్లో విలీనం చేసిన వీఆర్వోలను పాత సర్వీసుతో సహా తిరిగి రెవెన్యూశాఖలోనే కొసాగించాలి. వీఆర్ఏల కారుణ్య నియామకాలు చేపట్టాలి.
– వంగ రవీందర్‌రెడ్డి,ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు
నల్ల బ్యాడ్జీలతో మాడల్ స్కూల్ టీచర్ల నిరసన
సిరిసిల్ల రూరల్, ఆగష్టు 12: తమకు ఏండ్ల తరబడి బదిలీలు చేపట్టడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని మాడల్ స్కూల్ టీచర్లు సోమవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. తమకు బదిలీలు లేక ఒకే పాఠశాలలో 11 ఏండ్లుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. 010 పద్దు ద్వారా వేతనాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేశ్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, బాలరాజు, అంజయ్య, శోభారాణి, రేణుక, జ్యోతి, సరిత, ప్రభాకర్, శివకుమార్‌రెడ్డి ఉన్నారు.
ప్రధాన డిమాండ్లు..
సర్కారు ముందు ఉద్యోగుల డిమాండ్లు ఇవే!