హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7 తరగతుల విద్యార్థులకు గణితం సబ్జెక్టును భౌతికశాస్త్రం టీచర్లే చెప్పాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కాకరేపుతున్నాయి. తాము ఎందుకు బోధించాలని భౌతికశాస్త్రం టీచర్లు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి గణితం సబ్జెక్టును స్కూల్ అసిస్టెంట్ (గణితం), భౌతికశాస్ర్తాన్ని స్కూల్ అసిస్టెంట్ (భౌతికశాస్త్రం) బోధించాలి. 6 నుంచి 10వ తరగతి వరకు గణితం టీచర్లు గణితాన్ని బోధిస్తే వారానికి 36 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది.
సైన్స్‌లో జీవశాస్త్రం, భౌతికశాస్ర్తాలను బోధించేందుకు ఇద్దరు టీచర్లు ఉంటారు. ఒక్కో సబ్జెక్టుకు 21 పీరియడ్లు అవుతాయి. ఈ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. తమకు సంబంధం లేని సబ్జెక్ట్‌ను ఎలా బోధించాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమపై పనిభారం మోపేలా ఉన్నదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.