హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈనెల 28న సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించనున్నట్టు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెండింగ్ సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని సీఎం ఇంటికి పాదయాత్ర కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయని ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యాశాఖ సీఎం వద్దే ఉన్నా పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు సర్కార్ కుట్ర పన్నుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెహమాన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండీ అన్వర్, చైతన్యయాదవ్, అనిల్, నాయకులు నెల్లి సత్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.