వరంగల్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘంతోపాటు పార్టీ నాయకులు మళ్లీ గురుకులాల బాట పట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. తన సొంత జిల్లాలోని బీసీ గురుకులంలో 177 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో దవాఖాన పాలుకావడం సీఎం రేవంత్రెడ్డి చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. అందాలభామల కోసం ప్లేట్ భోజనానికి రూ.లక్ష, సమీక్ష పేరిట వేములవాడకు సీఎం వచ్చిన సందర్భంగా ప్లేట్ భోజనానికి రూ.1.35 లక్షలు చెల్లించిన రేవంత్రెడ్డి సర్కార్.. గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు నూరు, నూటయాభై రూపాయలు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు.
ఆదివారం ఆయన భూపాలపల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక మూడు వేల మంది గురుకులాల విద్యార్థులు విష ఆహారం తిని దవాఖాన పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. తల్లి, తండ్రి పాత్ర ప్రభుత్వమే పోషించాలన్న సంకల్పంతో కేసీఆర్ రాష్ట్రంలో 1,022 గురుకులాలు ఏర్పాటుచేస్తే అందులోని పిల్లలకు సరైన ఆహారం అందించలేని సీఎం రేవంత్రెడ్డి సిగ్గు లేకుండా ‘రైజింగ్’ అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. గురుకులాల్లో పిల్లలకు పెడుతున్న విష ఆహారాన్ని తన ఇంట్లో పెడితే సీఎం రేవంత్రెడ్డి ఊరుకుంటాడా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్ అయిన పిల్లలు ఆగమవుతుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నాలుగైదు, రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు గురుకులాల బాట పట్టాలని పిలుపునిచ్చారు.