నారాయణఖేడ్/నాగల్గిద్ద, జూలై 21 : సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మొర్గి ఆదర్శ పాఠశాల హాస్టల్లో సోమవారం ఫుడ్ పాయిజన్‌తో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొర్గి మాడల్ స్కూల్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి 70 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆదివారం రాత్రి చికెన్ తిన్న 11 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురికాగా వాచ్‌మన్ నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
నలుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్‌గా ఉండగా, మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వసతి గృహంలో అన్నం, పప్పు, నీళ్లచారుతో పాటు తాగేనీళ్లలో పురుగుల దర్శనం ఇస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. తమ సమస్యలను వార్డెన్, ప్రిన్సిపాల్ సువర్ణ పట్టించుకోవడం లేదని తెలిపారు. డీఈవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో అశోక్‌చక్రవర్తి, తహసీల్దార్ శివకృష్ణ, ఎంఈవో మన్మథకిశోర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి విద్యార్థులను పరామర్శించారు.
ప్రభుత్వ నిర్యక్షంతోనే విద్యార్థులకు ఇబ్బందులు: మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
పాఠశాలల్లో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నారాయఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆరోపించారు. మోర్గి మోడల్ స్కూల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులు కలుషిత ఆహారం, విష జ్వరాలతో అస్వస్థతకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు.