Food Adulteration | వికారాబాద్ జిల్లా తాండూరు గురుకుల పాఠశాల హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో దాదాపు 15 మంది వరకు అస్వస్థతకు గురవగా.. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగినట్లు తెలుస్తున్నది. తాండూరు టౌన్‌లోని సాయిపూర్లో బాలిక గురుకుల హాస్టల్ కొనసాగుతున్నది. అయితే, గత కొద్దిరోజులుగా వసతిగృహంలో అందిస్తున్న భోజనం నాణ్యత సరిగా లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నంలో పరుగులు వస్తున్నాయని.. మెత్తగా ఉండడంతో పాటు నీళ్ల చారు వడ్డిస్తున్నారన్నారు.
తాజాగా ఈ నెల 9న రాత్రి భోజనం తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఘటన తర్వాత తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గత కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో హైకోర్టు సైతం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. మళ్లీ ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.