జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 20 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని నర్సీ మోంజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీలో గురువారం ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను దవాఖానకు తరలించాల్సిన యాజమాన్యం యూనివర్సిటీలోనే ఓ డాక్టర్‌తో రహస్యంగా చికిత్స చేయించి ఉంచారు. మీడియాను యూనివర్సిటీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వచ్చి 27 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్న విషయాన్ని గుర్తించి వర్సిటీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో యాజమాన్యం అంబులెన్స్‌ను రప్పించి ప్రైవేటు దవాఖానకు తరలించారు.
వైద్య, విద్యాశాఖాధికారులు శివకాంత్, జగదీశ్ యూనివర్సిటీకి చేరుకుని వివరాలు సేకరించారు. యూనివర్సిటీ క్యాంటీన్లో ఫుడ్‌పాయిజన్ కావటంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు ఆరోపణలు వినిపించాయి. యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ మహేశ్ మాత్రం కొందరు విద్యార్థులు బయటి హోటళ్లలో ఫుడ్ తినడంతోనే అస్వస్థతకు గురైనట్టు చెప్పుకొచ్చారు.
నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం జడ్పీ పాఠశాల విద్యార్థులు గురువారం నిరసనకు దిగారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో విద్యార్థులు శాంతించారు.