హైదరాబాద్, జూలై 28 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు కులుషిత ఆహారంతో అనారోగ్యం పాలవుతున్న వరుస సంఘటనల పట్ల ప్రముఖ తెలంగాణ కవి జూలూరు గౌరీశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజకీయాలనే కాకుండా పిల్లలు తినే తిండిని కూడా విషమయం చేశారని విమర్శించారు. ఇదేం ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక కవిత రూపంలో తన ఆవేదనన వ్యక్తంచేశారు. ‘రాజకీయాలనే కాదు పిల్లలు తినే తిండిని కూడా విషం చేస్తిరి కదరా.. మా బడుగు బిడ్డల ప్రాణాలు అంటే ఇంత చులకనా? మా బిడ్డలకు పెట్టే తిండిని మీ పిల్లలకూ పెడతారా? రండి సామూహిక భోజనం చేద్దాం.
అధికారంలోనే కాదు తినే తిండిలోనూ వివక్షే. ఇదేనా ప్రజా పాలన? కింది కులాలు ఇప్పుడే చదువులకు వస్తున్నాయి. గురుకులాల్ని ఆత్మహత్యల వేదికలని చేస్తిరి కదరా! మంచినీళ్లు ఇవ్వలేని వాళ్లు, కలుషిత పాలకులే కదా! గుండె మండి అడుగుతున్నా. మీరు బడుగుల భక్షకులు..పిల్లల హంతకులు. పిల్లలను, పువ్వులను ప్రేమించలేని నరరూప రాక్షసులు’ అని పేర్కొన్నారు.