హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : పీఆర్సీ, పెండింగ్ బకాయిలపై సర్కార్ దృష్టిసారించకపోవడంపై తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య మాట్లాడుతూ పీఆర్సీ, పెండింగ్ బకాయిలపై సర్కార్ దృష్టిపెట్టాలని కోరారు. ఈ అంశాలను పక్కదారి పట్టించేందుకు రూ.1.2 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. అవసరంలేకున్నా భారీ సమావేశం ఏర్పాటు చేశారని, ఆర్భాటం తప్ప మరేమీ లేదని సంఘం జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య విస్మయం వ్యక్తంచేశారు.
రేపటి నుంచి ‘బ్రిక్స్’ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : బ్రిక్స్ దేశాల ట్రేడ్ యూనియన్స్ ఫోరం సమ్మిట్ మంగళవారం నుంచి ఈనెల 16 వరకు హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో జరుగనున్నది. సమ్మిట్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. 16 దేశాల నుంచి 50 మంది కార్మిక సంఘాల ప్రతినిధులు, మన దేశం నుంచి 70 మంది కార్మిక సంఘాల నేతలు సమావేశాలకు హాజరవుతారని ఫోరం చైర్మన్ సుంకరి మల్లేశం తెలిపారు.