హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల సాధనపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మైనర్ ట్యాంకుల ద్వారా ఆదా చేసిన 45 టీఎంసీలపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. శనివారం మంత్రి ఉత్తమ్ జలసౌధలో ఇరిగేషన్‌శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి నీటి లభ్యతను అధ్యయనం చేయాలని సూచించారు.
సమ్మకసాగర్ ప్రాజెక్టు వరద, ముంపుపై చత్తీస్‌గఢ్ అభ్యంతరాల నేపథ్యంలో మరోసారి సిమ్యులేషన్ స్టడీస్ చేయించాలని ఆదేశించారు. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్‌పూల్‌లో భారీ గొయ్యి పడి చివరికి డ్యామ్‌కే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పటిష్ఠతపైనా దృష్టి సారించాలని సూచించారు. ఆ రెండు ప్రాజెక్టుల భద్రతపై ఎన్డీఎస్ఏతో ప్రాథమిక సర్వే చేయించాలని కోరారు. మంత్రి ఆదేశాలతో ఈఎన్సీ అనిల్‌కుమార్ ఎన్డీఎస్ఏకు లేఖ రాశారు. డ్యామ్‌ల పటిష్ఠతపై సర్వే చేయించాలని కోరారు. అనంతరం తాగునీటిపై కలెక్టర్లతోనూ మంత్రి ఉత్తమ్ సమీక్షించారు.