హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): దేశంలో పప్పుదినుసుల సాగును విస్తరించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సూచించారు. పప్పుదినుసుల సాగు, విస్తీర్ణం పెంచడంపై శుక్రవారం 10 రా ష్ర్టాల వ్యవసాయ మంత్రులతో శివరాజ్‌సింగ్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాల దృష్ట్యా పప్పుదినుసుల సాగును పెంచాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలోని తాండూరు కందిపప్పుకు ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉన్నదని, ప్రతి సంవత్సరం 4 లక్షల క్వింటాళ్ల కందిపప్పు ఈ ప్రాంతం నుంచే మార్కెట్‌కు వస్తున్నదని వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తాండూరులో పప్పుదినుసుల బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన శివరాజ్‌సింగ్ పూర్తి వివరాలతో ఢిల్లీకి వచ్చి కలువాలని సూచించారు.