‘చెరువులో చేపలను నింపినట్టు.. ఈ నగరాన్ని ప్రజలతో నింపు దేవుడా’ అని హైదరాబాద్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు కులీ కుతుబ్‌షా ప్రార్థించాడని చరిత్ర చెప్తున్నది. మూసీ నది ఒడ్డున వెలసిన నగరం సర్వతోముఖాభివృద్ధి చెందింది. కానీ వందేండ్ల కింద ఉప్పొంగి జనాలను ముంచింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మూసీ ఉధృతిని తగ్గించేందుకు కృషి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దార్శనికతతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. జనంపైకి వరద రాకుండా అడ్డుకోవడానికి కట్టిన జలాశయాల గేట్లను ఎత్తడం వెనుక ఆంతర్యమేంటో ఏలినవారికే తెలియాలి. కానీ జనం మీదకు వదిలిన నీరు ప్రళయం సృష్టించింది. ప్రజానీకాన్ని ముంచింది… బస్తీల బతుకులను బజారున పడేసింది. శుక్ర, శనివారాల్లో మూసీ ముంచెత్తడంతో పరీవాహక ప్రాంతంలోని జనాలు గూడుచెదిరిన పక్షుల్లా, ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల్లాడుతున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపునింపుకోలేని బతుకుల్ని మూసీ నిలువునా ముంచింది. ఇరుకిల్లే ప్రపంచం అనుకునే బీదల బతుకుల్లో బురద కొట్టింది. అధికారులు హెచ్చరికలు లేకుండానే జలాశయాల గేట్లు ఎత్తడంతో బస్తీవాసులను మూసీ ముట్టడించింది. శుక్రవారం సాయంత్రం నదీ ప్రవాహం ఇంటిల్లిపాదినీ తరిమికొట్టింది. తలోదిక్కుపోయిన జనం మళ్లీ ఇంటికొచ్చి చూసుకుంటే ఏమీ మిగల్లేదు. అంతా వరదపాలై పోయిందని ఏడ్వడం తప్ప బస్తీల్లో మరో మాట లేదు. రెండు రోజుల వరద
మోసుకొచ్చిన బురదను చూసుకుంటూ నీళ్లపాలైన కష్టార్జితాన్ని చూసి ఏడ్చుకుంటూ బస్తీ జనం విలపిస్తున్నారు. జీవితకాలం కష్టం గంగపాలైపోయింది. ఏ ఇంటికిపోయినా కట్టుబట్టలుతప్ప ఏమీ బాగాలేవన్న బాధే.
మా గోడు వినేవాళ్లే లేరు! మూసీ ముంచెత్తిన మూసారాంబాగ్, శంకర్‌నగర్ (మలక్‌పేట్), న్యూ అంబేద్కర్‌నగర్ (అంబర్‌పేట), వినాయకవీధి (మలక్‌పేట్), మూసానగర్, కృష్ణానగర్ (కాచీగూడ) బస్తీల్లో ఇండ్లు, ఇండ్లను ఆక్రమించిన బురద తప్ప ఏమీ కనిపించిన దుస్థితి. బురదను ఎత్తిపోసేందుకు పురపాలక సిబ్బంది లేక ఆదివారం నాడు రోడ్లన్నీ మడుగుల్లెక్కనే ఉన్నయి. మూసీ ప్రవాహం పోటెత్తడంతో మలక్‌పేట, అంబర్‌పేట, మూసారాబాగ్ సమీపంలోని బస్తీలన్నీ శుక్రవారం, శనివారం జలమయం అయినయ్. లెక్కలేనన్ని వానలు, ఎన్నో వరదలు చూసిన బస్తీవాసులు ఎన్నడూ చూడని వరదను ఎత్తిపోసుకుంటున్నారు. ‘ఇంతకన్నా పెద్ద వానలు చూశినం. ఎంత వరద వచ్చినా ఇంట్లకు రాలే. ఇప్పుడెందుకొచ్చిందో మాకెరుకే’ అంటూ బస్తీ జనం అధికారులకు శాపనార్థాలు పెడుతున్నరు. ‘అధికారులు ఎందుకు రావట్లే. మా బాధలు ఎందుకు వినట్లే. మాకు న్యాయం చేయాలె’ అనే జనం ఎన్నో ఆరోపణలు చేస్తున్నరు. ముఖ్యంగా తమ ఇండ్లను కూల్చేందుకు హైడ్రా కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు. ఇది మూసీ ఉగ్రరూపం కాదని, హెచ్చరికలు లేకుండా వచ్చిన వరద కచ్చితంగా హైడ్రా కుట్రనే అని మండిపడుతున్నారు. ‘ఇండ్లు ఖాళీ చేయించనీకి మా బతుకుల్ని వరదపాలు చేయడం న్యాయమేనా?’ అని అడుగుతున్నరు.
బావురుమంటున్న బస్తీలు
మూసీ వరదల్లో చిక్కుకున్న బస్తీల్లో నుంచి శనివారం సాయంత్రం వరద వెనక్కుపోవడం మొదలైంది. ఆదివారం ఉదయం ప్రజానీకం మెల్లమెల్లగా ఇండ్లల్లోకి తిరిగి చేరుకుంటున్నరు. ఇప్పటికీ కొన్ని ఇండ్లు తాళాలు పడే ఉన్నయి. తలుపు తెరిచి చూస్తే ఏమీ మిగల్లేదని బాధితులు వాపోతున్నారు. ఇండ్లల్లోని సామాన్లు, వస్తువులు బురదపాలైపోయాయని విలపిస్తున్నారు. బురదను ఎత్తిపోస్తూ పిల్లాజెల్లా కష్టపడుతున్నారు. ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకునేందుకు కూడా నీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద వదులుతున్నట్టు ముందే చెప్తే సామాన్లయినా కాపాడుకునేటోళ్లం కదా అని ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ‘మమ్మల్ని ఈడికెల్లి తరమాలనుకున్నరు గవర్నమెంటోళ్లు. అందుకే మా బతుకుల్లో బురద గొట్టిన్రు’ అని అనని తల్లి లేదు. ‘సీఎం రేవంత్‌రెడ్డి మా గురించి ఏం ఏమైనా ఆలోచిస్తున్నడా? మా బాధ గురించి ఏమైనా పట్టించుకుంటున్నడా?’ అని నిలదీస్తున్నారు. వరద ఉధృతికి దెబ్బతిన్న ఇండ్ల ఆనవాళ్లు కోల్పోవడంతో.. అక్కడ ఉండలేక దూరంగా ఫుట్‌పాత్‌ల మీద, ఇండ్ల అరుగుల మీద బతుకులు వెళ్లదీస్తున్నారు.
ఇండ్లు ఖరాబ్.. సామాన్లు గాయబ్
బస్తీల్లో ఉండే కిరాణా షాపులు, టైలరింగ్ షాపులు, చేతి వృత్తుల వాళ్ల సామాగ్రి పూర్తిగా నీటిపాలైంది. వీధుల్లో పార్క్ చేసిన వేలాది వాహనాలు పనిచేసే పరిస్థితిలేదు. వాహనాలే జీవనాధారంగా ఉన్న బస్తీ ప్రజలకు ఉపాధి లేకుండాపోయింది. ఇండ్లలో నుంచి మెకానిక్ షెడ్లలో నుంచి చాలా వాహనాలు మూసీ వరదలో కొట్టుకుపోయాయి. తమ వాహనాలు తిరిగి అప్పగించాలని యజమానులు మెకానిక్‌లను డిమాండ్ చేస్తున్నరు. మూసీ పరీవాహకంలోని దోబీ ఘాట్లలో కూడా ఇదే సమస్య నెలకొంది. రజకులు మూటలు కట్టి దాచుకున్న దుస్తులన్నీ వరదకు కొట్టుకుపోయాయి. లాడ్జ్‌ల దుప్పట్లు, కవర్లు, ఫంక్షన్ హాల్ స్క్రీన్లు మూసీలో కొట్టుకుపోయా. వాటిని అప్పగించాలని దోభీలతో హోటల్ యజమానులు ఘర్షణకు దిగుతున్నారు. విపత్తులో నష్టపోయిన తమకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మూసీకి సమీపంలోని ఇండ్లలోని గొర్రెలు, కోళ్లు, బాతులు నదిలో కొట్టుకుపోయినయి.
పుస్తకాలు తడిసిపోయినయ్
మూసానగర్‌లో ఒక్కసారిగా మూసీ ముంచెత్తడంతో ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఆదివారం వరద ఉధృతి తగ్గడం, ఇండ్లలో నీరు బయటకు పోవడంతో ప్రజలు సామాన్లను, వస్తువులు, వాహనాలను శుభ్రం చేసుకుంటున్నారు. ఇలాంటి వరద ఎప్పుడూ చూడని చిన్నారులకు ఏం జరిగిందో కూడా అర్థం కావడంలేదు. ఆడుతూ పాడుతూ తిరిగిన కాలనీలు నదిలో ఎందుకు మునిగిపోయాయో అంతుపట్టడంలేదు. వదర ఎందుకు వచ్చిందో తెలియని విద్యార్థులు… తల్లిదండ్రులతో కలిసి బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తమ పుస్తకాలను చూసి విలవిల్లాడిపోతున్నారు. తడిసిపోయిన పుస్తకాలను అరబెట్టుకుని, కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆదివారం మూసానగర్‌లో ఏ ఇంటి వద్ద చూసినా.. ‘పుస్తకాలు తడిసిపోయినయ్’ అంటూ అమాయకంగా చెప్పే చిన్నారుల మాటలు చూపరుల హృదయాలను కదిలించాయి.
చిట్టి తల్లి పెద్ద మనసు
ఈ చిన్నారి పేరు సంధ్య. మలక్‌పేటలోని శంకర్‌నగర్ బస్తీలో అద్దెకు ఉంటున్నారు. వీళ్ల అమ్మ పనికి పోయింది. మూసీ వరద మోసుకొచ్చిన బురదతో సంపు నిండిపోయింది. ఇల్లంతా బురద. బట్టలన్నీ బురద. బాసన్లకు బుదర పట్టింది. బట్టలన్నీ తడిసిపోయినయ్. అన్నీ సాఫ్ చేయాల్నంటే నీళ్లు కావాలె. అందుకే ముందుగా సంపు సాప్ చేయానీకి పూనుకున్నదీ చిట్టితల్లి. ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప మిగిలిన బట్టలన్నీ పాడైపోయినయ్. ఒంటి మీద ఉన్న బట్టలకు బురదంటకుండ వాటిని విప్పి చిన్నగా నీళ్లు తోడింది. తల్లికి చేదోడయ్యిందని దారినపోయేటోళ్లు మెచ్చుకున్నరు. ఎందుకిట్ల చేస్తున్నవని అడిగితే.. ఇది మా సంపు కాదు. మాది పక్క ఇల్లని చెప్పింది. వాళ్ల దోస్తు వాళ్ల అమ్మ పనికి పోయింది. వాళ్లకు నాన్న లేడు. ‘ఇల్లంత ఆగంగుంటే సాయం చేయనీకి వచ్చిన’ అని చెప్పింది ఈ బంగారు తల్లి! గవర్నమెంట్‌కు కూడా ఈ చిట్టితల్లికి ఉన్నంత పెద్ద మనసు ఉంటే బాగుండు అని అందరూ అనుకున్నరు.
దసరా సంబురం ఎత్తుకుపోయిన వరద
కల్వకుర్తి దగ్గర అంతారం ఊరి నుంచి వచ్చినం. మా నాన్న చనిపోయిండు. మా అమ్మ ఇండ్లల్ల పని చేస్తది. ఒక్క గదిలో అద్దెకు ఉంటున్నం. దసరా పండుగొచ్చిందని అమ్మ అప్పు చేసి నాకూ, అన్నకు కొత్త బట్టలు కొన్నది. పండుగ రోజు ఆ కొత్త బట్టలు కట్టుకోవాలనుకున్నం. ఇంతల్నే వరదొచ్చింది. ఇల్లొదిలిపోయినం. చిన్న షెల్ప్ ఉంది. అన్నీ తడిస్తే తడవనీ, పుస్తకాలు తడవొద్దని అమ్మ పైన పెట్టింది. నా పుస్తకాలు, అన్న పుస్తకాలు తప్ప అన్నీ మునిగినయ్. కొత్త బట్టలకు బుదరపట్టింది. ఉతుక్కుని అరేసినం.
-గౌతమ్, శంకర్ నగర్, మలక్‌పేట
పదిరోజులు ఆపి.. ఒక్కసారే వదిలి
మూసీకి వరద వచ్చేది అధికారులకు తెల్వదా? పది రోజుల నుంచి నీళ్లు వదలకుండా ఆపిన్రట. ఆ నీళ్లన్నీ ఒక్కసారే వదిలితే ఇంత వరద రాకపోతే ఏమైతది? ఎన్నడూ లేని బాధ ఇప్పుడొచ్చింది? ఇంతకుముందు వచ్చిన వరదల కంటే ఈ సారి వచ్చిన వరద ఎక్కువ. గండిపేట నీళ్లు ఒక్కసారిగా కిందకు వదిలిన్రు కాబట్టే ఇట్లయ్యింది. తప్పు చేశినోళ్లకు ఏం శిక్ష వేస్తరు. శిక్ష సీఎంకు వేయాల్నా.. ఎమ్మెల్యేకు వేయాల్నా? ఈ సర్కార్‌లో అన్నీ సమస్యలే. పరిపాలనే సక్కగ లేదు.
-ఎండీ ఆసిఫ్, మూసారాంబాగ్
కార్లు కొట్టుకుపోయినయ్
రిపేరు అయిపోయిన కార్లు పక్కకు పెట్టినం. ఓనర్స్ తీస్కపోవాలె. ఇంతల్నె వరదొచ్చింది. వరద పెరిగే సరికి నీళ్లల్లో తేలినయ్. మూసీ గుంజుకపోయింది. ఓ బీఎండబ్ల్యూ కారును మూసీలోంచి తెచ్చినం. ఇంకా రెండు హ్యుందాయ్ కార్లు జాడ లేకుండా పోయినయ్. మా పనిముట్లు, కార్ల పార్టులన్నీ వరదల కొట్టుకుపోయినయ్. పైన వానలు పడ్డయని ముందే తెలుసు. ఆలస్యం చేయకుండ అప్పుడే నీళ్లొదిలితే ఇట్ల కాకుండు. ఇంతకన్నా పెద్ద వానలు పడ్డప్పుడు ఇట్ల కాలేదు. ముందుగాలే కొన్ని గేట్లు ఎత్తి పెట్టినట్టయితే నీళ్లు రాకపోవు.
-ఎండీ సోహెల్, మూసారాంబాగ్
పాములొచ్చి పట్టుకున్నయ్
వరద ఒక్కసారే వచ్చింది. ఎక్కువ గేట్లు ఎత్తబట్టి ఒకేసారి వరదొచ్చింది. ఆరు గంటలకు మా వర్క్‌షాప్‌లోకి నీళ్లొచ్చినయ్. మోకాలి లోతు నీళ్లల్ల అట్లనే ఉందామనుకుని ధైర్యంగనె ఉన్నం. గంట గంటకు నీళ్లు పెరుగుతున్నయ్. బయటికి పోయేట్టు లేదు. ఏమీ చేయాల్నో అర్థం కాలేదు. ఎక్కడోళ్లం అక్కడనే ఉన్నం. ఆఫీసర్లు నీళ్లు వదిలిపెట్టిన్రు. కానీ నీళ్లల్లో చిక్కుకోకుండా ముందేం చేయాలో చేయలే కదా. నీళ్లల్లో చిక్కుకున్న వాళ్లను బయటికి తీసుకురానీకి వాళ్లేం చేశారో మాకు తెలియదు. నీళ్లల్లో పాములున్నయ్. అదే నీళ్లల్ల మేమున్నం. పాములు కాళ్లకు చుట్టుకుంటున్నయ్. ఒక నిచ్చెన గోడకు వేసుకోని పైకెక్కినం. గోడ దుంకి పోయినం.
-కుమ్మరి కిరణ్, వాషింగ్ సర్వీస్ వర్కర్
ఇంత కుట్ర చేయాల్నా?
నాది చిన్న మిషన్ల కార్ఖానా. నాకు ఇద్దరు పిల్లలు. వరద నా దుకాణాన్ని మొత్తం ముంచింది. మిషన్లన్నీ దెబ్బతిన్నయ్. రోజుకు ఐదువందల నుంచి వెయ్యిరూపాయలు వచ్చేది. ఇప్పుడు మొత్తం పోయింది. మేం ఎట్ల బతకాల్నో అర్థమైతలేదు. ఇదంత ప్లాన్‌తోనే చేసిన్రనిపిస్తున్నది. అసలు నీళ్లు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ రాలే. హైడ్రాను చూపించి బెదిరించాలని అనుకుంటున్నారా? ఏం చేస్తున్నరు? సర్కార్ తీరేం బాగాలేదు. ముందు జనం బతుకులు బాగు చేయున్రి. జనాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇంత కుట్ర చేయాల్నా?
-యూసఫ్, కార్ఖానా
బస్టాండ్, మెట్రో కూలుస్త్తరా?
మూసీ నీళ్లొంచ్చిన కాడికల్లా మార్క్ చేస్తమంటున్నరు… కూలుస్తమంటున్నరు. మరి ఎంజీబీఎస్ నీళ్లల్ల మునిగింది. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ మూసీలనే కట్టిన్రు. వాటిని కూలుస్తరా? మా ఇండ్లను కూల్చేందుకే పక్కా ప్లాన్‌తోనే ముందు చెప్పుకుండ వరద వదిలిన్రు. ఈ వరదతోని మూసీ నది ఏడి దాంక ఉందో తెలిసిపోయిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నడు. మా ఇండ్లు నీట మునిగినయనే సోయి లేకుండా అట్ల మాట్లాడొచ్చా? మాకు కనీసం తలదాచుకునేందుకు జాగ చూపియ్యాలె కదా. సీఎం రేవంత్ రెడ్డి కలలు కన్న మూసీ ప్రాజెక్టు కోసం మా బతుకుల్ని నీళ్లపాలు జేసిండు. ఇంటి పైకప్పు దాంక నీళ్లొంచ్చినయ్.
-నియాజుర్ రహీమ్, మూసానగర్ బస్తీ
గరీబోళ్లంటే సర్కార్‌కు పగ
ఈడ పాతికేండ్ల నుంచి ఉంటున్నం. నా భర్త చనిపోయిండు. నేనే కూలి పనులు చేసుకుంట పిల్లల్ని సదివించుకుంటున్న. మొన్ననే నా బిడ్డ పెండ్లి చేద్దామని బట్టలు కొన్నం. వరదలో ఇల్లంతా మునిగిపోయింది. పెండ్లి బట్టలన్నీ వరద పాలైనయి. సామాన్లన్నిటింటికి బురదంటుకున్నది. ఇన్ని సామాన్లు మళ్లా కొనాలంటే కూలి జేసుకుంట ఎట్ల కొనాలె?. మా గరీబోళ్లంటే ఈ గవర్నమెంట్‌కు ఎందుకింత పగ?
-గాదెపాక లక్ష్మమ్మ, మూసానగర్ బస్తీ
ముంచిన మూసీ..
మునిగిన దారిమూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద ముంచెత్తిన వరద ఉధృతి, పక్కనే కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద కుప్పలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం
గూడు చెదిరి.. గుండె పగిలి
చాదర్‌ఘాట్ వద్ద మూసీ వరదతో బురదమయంగా మారిన మూసానగర్ బస్తీ, వరద తగ్గిన తర్వాత సామగ్రిని బయట పెట్టి, ఇండ్లను శుభ్రం చేస్తున్న ప్రజలు