నమస్తే న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 17: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వర ద కొనసాగుతున్నది. ఆదివారం జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద రావడంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల మొత్తం అవుట్‌ఫ్లో 1,17,846 క్యూ సెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.989 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు వరద భారీగా చేరుతుండటంతో 17 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 68,334 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం టీబీ డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 46,533 క్యూసెక్కులు ఉం డగా, అవుట్‌ఫ్లో 82,380 క్యూసెక్కులు ఉన్న ది.
శ్రీశైలం జలాశయానికి ఆదివారం ఎగువ నుంచి 1,66,396 క్యూసెక్కులు రాగా 3 గేట్లు పది మీటర్ల మేర ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్ ఫ్లో 1,44,807 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 215.8070 టీఎంసీలకు ప్రస్తుతం 195.6605 టీఎంసీలు ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి 1,45,076 క్యూసెక్కుల వరద వస్తుండగా సాగర్ డ్యామ్ 22 క్రస్ట్ గేట్లు, కాల్వలు, జలవిద్యుత్తు కేంద్రాల ద్వారా 2,11,820 క్యూసెక్కుల అవుట్ ఫ్లోను కొనసాగిస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ 586.70 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది.
ఎస్సారెస్పీకి 1.51 లక్షల క్యూసెక్కుల వరద
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రెండు, మూడు రోజులుగా వరద పోటెత్తుతున్నది. దీంతో కేవలం ఒక్కరోజే ప్రాజెక్టులోకి 11 టీఎంసీల నీరు వచ్చి చేరింది. వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రాజెక్టు ఇప్పటికే 67 టీఎంసీలకు చేరుకున్నది. ఆదివారం ప్రాజెక్టులోకి 1,51,806 క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్ట్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1086.30 అడుగుల (67.036 టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది. కాగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఆదివారం మధ్యాహ్నం వరకు 49 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,400.42 అడుగుల (11.807 టీఎంసీలు)కు చేరుకున్నది. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి నాలుగు రోజులుగా భారీగా వరద వస్తుండటంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం 28,357 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, ఐదు గేట్లు ఎత్తి దిగువకు 43,634 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.366 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది.
లక్ష్మి బరాజ్‌కు వరద
లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన బరాజ్‌కు ఆదివారం 3,73,500 క్యూసెకుల ఇన్‌ఫ్లో వస్తుండగా మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవా హం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద భారీగా వచ్చి చేరడంతో ఆదివారం ఉదయం 7 గంటలకు 33 అడుగులున్న గోదావరి మధ్యాహ్నం 3 గంటల సమయానికి 33.7 అడుగులకు చేరుకున్నది. చర్లలో తాలిపేరు వద్ద 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ వరద ప్రవాహం రాత్రికి మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని సీడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు.