మక్తల్/ధరూరు/అయిజ, జూన్ 10 : ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద వస్తున్నది. మూడు రోజులుగా వరద నిలకడగా వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణానదికి వరద రాకుండా అడ్డుకునేందుకు కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లా బీర్జాపూర్ వద్ద రోడ్-కం- బరాజ్ నిర్మించారు. అయితే, భారీగా వరద వస్తుండటంతో సోమవారం బీర్జాపూర్ బరాజ్ గేట్లు తెరిచేందుకు అధికారులు ప్రయత్నించగా.. గేట్లు మొరాయించాయి. దీంతో వరద సిల్ప్వే గేట్ల పైనుంచి పారుతున్నది. ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నందున మరో రెండు,మూడు రోజుల్లో కృష్ణమ్మకు వరద పోటెత్తే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. కాగా జూరాల ప్రాజెక్టుకు సోమవారం 3,806 క్యూసెక్కులు, కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు 4,550 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు 6,658 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, అంతే వరద దిగువకు పారుతున్నది.