హైదరాబాద్, జూలై26 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతున్నది. అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరువలో ఉన్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర బేసిన్లలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లు పూర్తిస్తాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువయ్యాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల నుంచి వరద జలాలను దిగువకు వదులుతున్నారు.
రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు సైతం ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకోగా, గేట్లను ఎత్తి దిగువకు జలాలను వదులుతున్నారు. ఆ తర్వాత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. శనివారం సాయంత్రానికి 1.02 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతానికి 205 టీఎంసీలకు చేరుకున్నది. రెండురోజుల్లో మరోసారి గేట్లను కూడా ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఎగువ నుంచి ఇప్పటికీ భారీగా వరద వస్తున్న నేపథ్యంలో జలవిద్యుదుత్పత్తి ద్వారా దిగువన నాగార్జున సాగర్‌కు పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ నీటినిల్వ సామర్థ్యానికి 10 అడుగుల దూరంలో ఉన్నది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 580.20 అడుగుల నీరు చేరింది. ఇదిలా ఉండగా ప్రాణహితలో తప్ప ప్రధాన గోదావరిలో ఇప్పటికీ వరద ప్రవాహాలు ప్రారంభమే కాలేదు. లక్ష్మీబరాజ్ వద్ద 3.48 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.
Flood Water