హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 5-6 తేదీల్లో నిర్వహించిన ఏఐ సదస్సుకు రూ.10 కోట్లు విడుదల చేయగా, జనాలు, ప్రతినిధుల్లేని సదస్సుకు ఇంతమొత్తంలో ఎలా ఖర్చు చేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాన్ఫరెన్స్ పేరిట కోట్లు పక్కదారి పట్టించిందనే ఆరోపణలు జోరందుకుంటున్నాయి.
హైదరాబాద్ వేదికగా గతంలో ఎన్నో అంతర్జాతీయ సదస్సులు జరిగినా ఈ స్థాయిలో ఖర్చు జరగలేదని.. ఇదో స్కాంలా ఉన్నదని ఐటీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ద్వారా రూ.9.5 కోట్లు విడుదల చేయగా, దీనికి అదనంగా స్పాన్సర్లు ఇచ్చే సొమ్ము కలుపుకుంటే రూ.పది కోట్లపైనే ఉంటుందని, ఇదంతా ఖర్చు చేశారా? ఆ పేరిట స్వాహా చేశారా? అన్న చర్చ జరుగుతున్నది. ఈ సదస్సుతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదని పేర్కొంటున్నారు.