గద్వాల/అయిజ/శ్రీశైలం/నందికొండ/మహదేవపూర్, జూలై 6 : ప్రాజెక్టులకు వరద భారీగా వస్తున్నది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,13,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 12 గేట్ల ద్వారా దిగువకు 79,920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తికి 29,296 క్యూసెక్కులతోపాటు వివిధ లిఫ్టులకు కలిపి మొత్తం అవుట్‌ఫ్లో 1,11,804 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.535 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పెరుగుతుండటంతో 19 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేరకు ఎత్తి 60,104 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి వదిలారు. ఆదివారం టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 52,308 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 62,444 క్యూసెక్కులుగా ఉన్నది.
ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 68,805 క్యూసెక్కులు ఉండగా, ప్రధాన కాల్వకు 595 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేసుల బరాజ్‌కు 68,210 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 11.8 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్నది. ఆదివారం సాయంత్రానికి 1,44,652 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులకు ప్రస్తుతం 8790.20 అడుగులుండగా, పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలకు 183.8486 టీఎంసీలుగా ఉన్నది. నాగార్జునసాగర్‌కు 57,496 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. రిజర్వాయర్ నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 526.70 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు ఆదివారం 70,710 క్యూసెకులకు వరద వస్తున్నది. మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.