నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 23: రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర బేసిన్లలో వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువయ్యాయి. ఆయా ప్రాజెక్టుల నుంచి జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో జూరాల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకోగా.. గేట్లను ఎత్తి 43వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. బుధవారం సాయంత్రానికి 1.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, 209 టీఎంసీలకు చేరుకున్నది.
ఈ నేపథ్యంలో 94వేల క్యూసెక్కుల వరద జలాలను దిగువ నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. ప్రాణహితలోనూ వరద ఉధృతి పెరగగా ప్రధాన గోదావరిలో ఇప్పటికీ వరద ప్రవాహాలు ప్రారంభం కాలేదు. ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో నీటిపారుదల శాఖ అధికారులు 15 గేట్లను ఎత్తి 32,981 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పాల్వంచ మండలంలో గల కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో నీటిమట్టం 402 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం వరకు 19 అడుగులకు చేరింది. గురువారం వరకు ఈ వరద క్రమంగా పెరిగే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బరాజ్‌కు బుధవారం ఇన్‌ఫ్లో 98,440 క్యూసెక్లు రాగా, బరాజ్‌లోని మొత్తం 85గేట్లు ఎత్తి అంతే మొత్తం ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం బరాజ్ రివర్బెడ్ నుంచి సముద్ర మట్టానికి 90.10 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా కాళేశ్వరంలో ప్రాణహిత, గోదావరి నదుల ప్రవాహం పెరిగింది.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద బుధవారం నుంచి గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతున్నది. అధికారులు ఏడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 1,24,110 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్టు నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. బరాజ్ మొత్తం 59 గేట్లకు గాను ఏడు గేట్లు ఎత్తి.. 1,33,654 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బరాజ్ వద్ద గోదావరి నీటి మట్టం 77.30 మీటర్లుగా నమోదైంది.
దేవాదుల ప్రాజెక్టులోని 7మోటర్ల ద్వారా గోదావరి నీటి పంపింగ్ కొనసాగుతున్నది. ఇప్పటికే 6 మోటర్లతో పంపింగ్ జరుగుతుండగా బుధవారం మరో మోటర్ ఆన్ చేశారు. ఫేజ్-1, ఫేజ్-2లో 2, ఫేజ్-3లో 4లో.. 7మోటర్లతో రోజుకు 1837క్యూసెక్కులను భీంఘనపురం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు.