Revanth Reddy | ‘ఉన్నది కాస్తా ఊడింది.. సర్వమంగళం పాడింది.. అయ్యయ్యో పార్టీ.. పరువు.. చేజారెనె..’ అన్నట్లుగా తయారైంది టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరిస్థితి. ప్రశ్నించే గొంతుకను అంటూ ఓట్లు దండుకుని పత్తాలేకుండా పోయిన ఎంపీ రేవంత్‌రెడ్డి మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. తన పార్లమెంట్ పరిధిలోనే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల జాప్యంపై ఏనాడూ ప్రశ్నించని రేవంత్‌రెడ్డి ప్రజావ్యతిరేకతను తగ్గించుకునేందుకు చేసిన సందర్శన డ్రామా అభాసుపాలయింది. పీసీసీ అధ్యక్షుడి ఎదుటే కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. రేవంత్‌రెడ్డి బిల్డప్ బెడిసికొట్టడంతో ఉప్పల్‌లో పార్టీ కార్యకర్తలే పొట్టు పొట్టు కొట్టుకుని పీసీసీ అధ్యక్షుడి ఫ్లెక్సీని చింపేశారు. ఎన్నుకున్న జనాన్ని గాలికొదిలేసి.. గాలి రాజకీయం చేస్తే గిట్లనే ఉంటదంటూ కాంగ్రెస్ శ్రేణులే గుసగుసలాడుకోవడం గమనార్హం.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 29(నమస్తే తెలంగాణ): “ప్రజల చేత… ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునేవాడు ప్రజా ప్రతినిధి”. అందుకే ప్రజాప్రతినిధి అనేవాళ్లు ప్రజల మధ్య ఉండాలి. ఎన్నుకున్న జనాన్ని గాలికొదిలేసి… గాలి రాజకీయం చేస్తే ఏమౌతుంది? బిల్డప్ బెడిసికొడుతుంది! ఫ్లెక్సీ ఏకంగా చిరిగేపోతుంది!! టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డికి ఈ నగ్న సత్యం తాజాగా అర్థమైంది. ఫలితంగా ఉప్పల్ చౌరస్తాలో… తన ముందే… తన పార్టీ కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి పొట్టుపొట్టుగా కొట్టుకోవడమే కాదు! చివరకు తనే ఫ్లెక్సీనే పరా… పరా… చింపేదాకా పరిస్థితి ‘చే’జారి పోయింది.
తెరవెనక ‘పోస్టర్’ కథ ఇదీ…
మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏనాడో తన పార్లమెంటును గాలికి వదిలేశారు. 2020లో నగరాన్ని వరదలు ముంచెత్తింది మొదలు… మూడు రోజుల కిందటి వరకు కుంభవృష్టి దంచి కొట్టినా… తన పార్లమెంటు పరిధిలో జనం ఎలా ఉన్నారని ఒక్క ప్రాంతానికి వచ్చిన దాఖలాలు లేవు. దీంతో కడుపుమండిన ఓటర్లు ఇటీవల ‘మల్కాజిగిరి ఎంపీ మిస్సింగ్’ అంటూ పోస్టర్లు వేశారు. కార్ఖానాలోని విక్రంపురి బస్టాపులో పెద్ద ఎత్తున వెలిసిన ఈ పోస్టర్లలో ఓటర్లు తమ ఆవేదన, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. తీరా… ఈ విషయం ఈనోటా ఆనోటా.. రేవంతుడికి చేరింది. రాజకీయ నాయకుడు కదా! తన పార్లమెంటు పరిధిలో ఉనికి చాటుకోవాలనుకున్నాడు.
అయినపోయిన పెండ్లికి బాజాలు…
ఉప్పల్ – నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం నత్త నడకన సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. భారత్‌మాల పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోనే ఉన్న ఈ ప్రాజెక్టు ఐదేండ్లుగా కొన‘సాగుతున్నా’… ఏనాడూ రేవంత్‌రెడ్డి ప్రశ్నించిన దాఖలాలు లేవు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలూ లేవు. అయితే, ఈ ప్రాజెక్టు సందర్భంగా ఉప్పల్ – నారాపల్లి రహదారి దెబ్బతిన్నది. పైగా కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టు పూర్తయితే తప్ప కేంద్రం ఆ రహదారికి మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వమే స్పందించి… రూ.4 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టేందుకు నిర్ణయించింది.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ‘పరిధి’ చూడకుండా పనులు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ కూడా ప్రకటించారు. కాగా, పోస్టర్లతో తాను కనబడటం లేదంటూ ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారని తెలుసుకున్న రేవంత్‌రెడ్డి… ఎలివేటెడ్ పనుల జాప్యంతో పాటు రోడ్లు దెబ్బతిన్నందున వెంటనే మరమ్మతులు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండు చేసేందుకు ఉప్పల్ పర్యటన పెట్టుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వం రూ.4 కోట్లతో పనులు చేపడుతున్నట్లు మీడియాలో కూడా వచ్చింది. అయినా… ఇలాగైనా తన ఉనికి చాటుకొని, తన వల్లే మరమ్మతులు జరిగాయంటూ బిల్డప్ ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి శనివారం ఉప్పల్ పర్యటన ఎంచుకున్నట్లు తెలిసింది.
అనుకున్నదొక్కటి… అయినదొక్కటి…
రేవంతుడి ఆలోచన ఇట్ల ఉంటే… పార్టీ శ్రేణుల తీరు మరోలా ఉంది. దీంతో శనివారం ఉదయం రేవంత్‌రెడ్డి ఉప్పల్ రాగా.. ఆయన ముందే ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. రేవంతుడి ముందే రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ రజితా పరమేశ్వర్‌రెడ్డి వర్గీయులు పిడి గుద్దులతో రణరంగాన్ని సృష్టించారు. చివరకు రేవంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి ఉన్న భారీ ఫ్లెక్సీని చించిపడేశారు. పోలీసులను సైతం పక్కకుతోసి వీరంగం ప్రదర్శించారు. అసలే నియోజకవర్గ ఓట ర్లు కోపంతో ఉన్నందున ఏదో తన ఉనికి చాటుకునేందుకు రేవంత్‌రెడ్డి వస్తే… ఇదేదీ పట్టని పార్టీ శ్రేణు లు రోడ్లపై పడి కొట్టుకోవడంతో రేవంతుడి పరువు పోవడమే కాదు! తానొకటి తలిస్తే… శ్రేణులు మరొకటి తలచాయంటూ లోలోపల కుమిలిపోయారనేది పార్టీ నేతలే చెప్పుకుంటున్న లోగుట్టు.