హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మొంథా తుపాను (Cyclone Montha) ధాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకోగా, మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తీవ్ర వాయుగుండం ఏపీ, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతున్నది. భద్రాచలానికి ఆగ్నేయంగా 50 కి.మీ. ఖమ్మంకు 110 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఖమ్మం జిల్లాలో 10 గంటలకు పైగా ఏకధాటిగా వర్షం పడుతున్నది. భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 16 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు (Flash Floods) ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో మూడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
6 జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావంతో మూడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెం.మీ. వర్షపాతం నమోదయింది. మొంథా తుపాను ప్రభావంపై సీఎం రేవంత్రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు. రైతులకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అత్యధిక వర్షాలు
