ధర్మపురి, జనవరి 31 : జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ బాలికల వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఐదుగురు విద్యార్థినులు ఫుడ్‌పాయిజన్‌కు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం అనంతరం ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ)చదువుతున్న గొల్లపెల్లి మండలం చిల్వకోడూర్‌కు చెందిన కీర్తిమణి కడుపు నొప్పి అంటూ కళాశాల నర్స్ సహోజకు చెప్పుకుంది. నెలసరి సమస్యగా చెప్పి మెడిసిన్ ఇవ్వకుండా విశ్రాంతి తీసుకోవాలని ఆమె సూచించింది.
కొద్దిసేపటికే ధర్మపురి మండలం బుద్దేశ్పల్లికి చెందిన అల్లకొం డ నందిని (ఫస్టియర్, సీఈసీ) కడుపు నొప్పి, వాంతులు అంటూ రాగా స్టాఫ్ నర్స్ ప్రిన్సిపాల్ కాళ్ల లక్ష్మికి తెలిపారు. మంచిర్యాల జిల్లా తాళ్లపేటకు చెందిన హుమేరియా(ఫస్టియర్ సీఈసీ), సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన శ్రావ్య(సెకండ్ ఇయర్ సీఈసీ), కో రుట్ల మండలం నాగులపేటకు చెందిన జుహా (ఫస్టియర్) కూడా కడుపునొప్పి, వాంతులు అంటూ ప్రిన్సిపాల్‌కు మధ్యాహ్నం 3 గంటలకే వచ్చి చెప్పారు. కడుపు నొప్పి తీవ్రం కావడంతో రాత్రి 8గంటలకు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆహారం సరిగా ఉడకక జరిగి ఉంటుదని వైద్యుడు రాము తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విద్యార్థులను పరామర్శించి, ప్రైవేటు దవాఖానకు తరలించారు.