మియాపూర్, ఆగస్టు 21: ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద స్థితి లో మృతి చెందారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్నది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మక్తామహబూబ్పేట్లో ఉప్ప రి లక్ష్మయ్య(60), ఆయన భార్య వెంకటమ్మ(55), కుమారుడు భగవత్ నివసిస్తున్నారు. లక్ష్మయ్య కూలీగా, వెంకటమ్మ పాఠశాల బస్సు అటెండర్‌గా, కుమారుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
ముగ్గురు కుమార్తెలకు లక్ష్మయ్య వివాహం చేశాడు. రెండో కూతురు కవిత, అల్లుడు అనిల్, వీరి కుమారుడు యువాన్ష్ లంగర్ హౌజ్ లో నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకునే అల్లుడు అనిల్ కొంతకాలంగా ఉపాధి లభించక నాలుగైదు రోజుల క్రితం మక్తా మహబూబ్‌పేటలోని మామ ఇంటి కి సమీపంలో అద్దెకు ఉంటున్నాడు.
బుధవారం అనిల్ భార్య కవిత, కుమారుడు యువాన్ష్తో కలిసి అనిల్ తన మామ లక్ష్మ య్య ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనం పూర్తి చేసుకుని నిద్రకు ఉపక్రమించారు. ఉదయం ఎంత పిలిచినా తలుపు తీయకపోవటంతో సమీప బంధువులు బలవంతంగా తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్లి చూసే సరికి లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవిత, యువాన్ష్ విగత జీవులుగా పడి ఉన్నారు. భోజనంలో విష పదార్థం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.