హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురుస్తాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు చాలా చురుకుగా ఉన్నాయని, తెలుగు రాష్ట్రాలపై కూడా ద్రోణి ప్రభావం ఉందని తెలిపారు. గుజరాత్, కేరళ దగ్గర కూడా మరో ద్రోణి కొనసాగుతుందని, వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకొని ఉంటాయని చెప్పారు. కొంచెం వేడి, ఉకపోత ఉండే అవకాశం ఉందని, సాయంత్రం 4 తర్వాత పశ్చిమ తెలంగాణలో జల్లులతో కూడిన వర్షం మొదలవుతుందని వెల్లడించా రు. ప్రధానంగా సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముందని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.