Maoists | ములుగు జిల్లాలోని తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భీమారంపాడు సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన భీకర పోరు ఐదుగురు మావోయిస్టులు మరణించారు.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాతో పాటు దాదాపు 2500 మంది మావోయిస్టులు భీమారంపాడు సమీపంలోని కర్రగుట్టలో ఉన్నట్లు నిఘావర్గాలకు ఇటీవల సమాచారం అందింది. దీంతో కర్రగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు రెండు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది. అటవీ ప్రాంతం మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేయడంతో పాటు హెలికాప్టర్లతోనూ మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే తారసపడ్డ మావోయిస్టులపై కాల్పులు జరిపి ఐదుగుర్ని హతమార్చారు. ఈ కూంబింగ్ ఆపరేషన్ నేపథ్యంలో భీమారంపాడు గ్రామస్తులు ఎవరూ కూడా బయటకు రావద్దని భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేశాయి. కాగా, ఈ ఆపరేషన్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.