హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాల కారణంగా ఐదుగురు రైతులు చనిపోయారని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కల్యాణ్ నాయక్ తెలిపారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం చేయాలని, వీటిని విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. 3,000 ఎకరాల్లో పంట నష్టపోయిందని, ఇందులో 800 మంది గిరిజన రైతులు ఉన్నారని చెప్పారు. వీరందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలపై మనీల్యాండరింగ్ చట్టం, విక్రయించిన దుకాణాల యజమానులపై పీడీ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీని కలిసిన వారిలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ నేనావత్, రాష్ట్ర కార్యదర్శి కుంజా సంతోష్, మహేష్ రూపావత్, బానోత్ అనూష, రమేష్ నాయక్ తదితరులు ఉన్నారు.