Land Grabbing | బంజారాహిల్స్, డిసెంబర్ 21: బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10.. నగరం నడిబొడ్డు. ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ రేటు ప్రకారం గజం విలువ దాదాపు రూ.95వేలు. అంటే బహిరంగ మార్కెట్లో అంతకు మూడింతలు. ఆ లెక్కన ఎకరం కనీసం రూ.150 కోట్లు పలుకుతుంది. ఇంతటి విలువైన ఏరియాలో ఒకటీ, అరా కాదు! ఏకంగా ఐదెకరాల ప్రభుత్వ భూమిపై కొందరు కన్నేశారు. గతంలో అక్కడ ప్రభుత్వం వేసిన రేకుల షీట్స్ రంగు మార్చి.. మరో వరుసలో రేకులషీట్లతో స్వాధీనం చేసుకోవడమే కాకుండా.. ఒక గది, రెండు షెడ్లు నిర్మించి, సీసీ కెమెరాలతో ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటుచేశారు. కండ్ల ముందు బహిరంగంగా ఇదంతా జరుగుతున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ, జలమండలి అధికారులు ‘మాకు ఏమీ కనిపించట్లేదు!’ అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. పేదోడు ప్రభుత్వ భూమిలో చిన్న గుడిసె వేసుకుంటేనే బుల్డోజర్లతో యుద్ధం ప్రకటించే అధికార యంత్రాంగం.. కొందరు ప్రైవేటు వ్యక్తులు ‘బిగ్’ స్కెచ్ వేసి సుమారు రూ.660 కోట్ల విలువైన భూమిని చెరబట్టినా అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారంటే తెర వెనక ఎంతటి బడా వ్యక్తులు చక్రం తిప్పుతున్నారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ జిల్లా షేక్‌పేట మండలం సర్వేనంబర్ 403/పీ (బంజారాహిల్స్ రోడ్డు నంబర్-10, టీఎస్ నంబర్ 1/1/1, బ్లాక్-హెచ్)లో 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో 2.20 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలోనే జలమండలికి కేటాయించగా.. అందులో ఎకరం స్థలంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. చాలాకాలంగా ఈ భూములపై రాధికా సొసైటీ, గోదావరి సొసైటీతోపాటు అనేకమంది కన్నేశారు. వారందరూ పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తులను గత ప్రభుత్వాలు తిరస్కరించాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేసులు కూడా కొనసాగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇంతటి విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా, ఉండేందుకు కరోనా సమయాన్ని కూడా లెక్క చేయకుండా, 2020లో రెవెన్యూ అధికారులు 18 ఎకరాలను స్వాధీనం చేసుకొని చుట్టూ రేకుల షీట్స్ వేశారు. అయితే పరుశరామ్ పార్థసారథి అనే వ్యక్తి చాలాకాలం కిందటే ఇందులో ఐదెకరాల భూమిపై కన్నేశారు.
నకిలీ డాక్యుమెంట్లతో రంగ ప్రవేశం
ఈ భూమికి సంబంధించి పరుశరామ్ పార్థసారథి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు తెలుస్తున్నది. వాటి ప్రకారం.. 1930లో హసన్ అలీ అనే వ్యక్తికి కేటాయించిన స్థలాన్ని ఆయన వారసుడు హసన్ అలీఖాన్ నుంచి నారయ్య, సాయన్న 2.20 ఎకరాల చొప్పున కొనుగోలు చేశారు. ఇందులో నారయ్య నుంచి 1998లో 2.20 ఎకరాలను తాను కొనుగోలు చేసినట్టు పార్థసారథి డాక్యుమెంట్లు సృష్టించారు. అదేవిధంగా నారయ్యకు చెందిన 2.20 ఎకరాలను గతంలోనే నూకల రాఘవరావు కొనుగోలు చేయగా, ఆయన మరణానంతరం అతని వారసుల నుంచి 2009లో తాను కొనుగోలు చేసినట్టు పార్థసారథి మరో డాక్యుమెంట్ సృష్టించారు. ఇలా ఐదెకరాల డాక్యుమెంట్లతో గతంలోనే ఆ భూమిలోకి ప్రవేశించి, ఒక గదిని నిర్మించారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ కబ్జాను సీరియస్‌గా తీసుకోవడంతో రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేసి.. పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో 27.12.2021న ఒకసారి (ఎఫ్ఐఆర్ 943/2021), 4.1.2022న మరోసారి (ఎఫ్ఐఆర్-11/22) ఫిర్యాదు చేయగా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారంటూ పోలీసులు కేసులు నమోదు చేసి, అరెస్టు కూడా చేశారు. అధికారులు పార్థసారథి నిర్మించిన గదిని కూల్చివేశారు. దీంతో ఆ కబ్జాపర్వానికి తెరపడింది.
న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్థసారథి మళ్లీ ఈ భూమిపై కన్నేశారు. కాకపోతే ఈసారి తెరవెనక పెద్ద తతంగమే నడిపారని తెలిసింది. ముఖ్యంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఆశ్రయించి ‘బిగ్’ స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇందుకోసం పార్థసారథి ముందుగా ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకువచ్చారు. తాను రాఘవరావు, సాయన్న అనే వ్యక్తుల వద్ద 2.20 ఎకరాల చొప్పున కొనుగోలు చేసిన ఐదెకరాల స్థలంలోకి బలరామరాజు తిరుపతి, వేములపల్లి బాలాజీ అనే వ్యక్తులు ప్రవేశించి, ఆక్రమించుకుంటున్నారంటూ 2వ అదనపు చీఫ్ జడ్జి న్యాయస్థానా న్ని ఆశ్రయించారు. వీరి నుంచి తన భూమి తనకు దక్కేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ఇదంతా ముందస్తు వ్యూహం కావడంతో బలరామరాజు తిరుపతి, వేములపల్లి బాలాజీ న్యాయస్థానానికి ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించకుండా ‘ఎక్స్‌పార్టీ’ అయ్యారు. దీంతో న్యాయస్థానం పార్థసారథికి ఇంజంక్షన్ ఆర్డర్ జారీచేసింది.
కానీ వాస్తవానికి ఈ భూమి ప్రభుత్వానిది అనే విషయం న్యాయస్థానానికి తెలియదు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. ప్రభుత్వ భూమిపై సంబంధంలేని ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటున్నారంటూ వాస్తవాల్ని కోర్టు ముందుంచాలి. రెవెన్యూ రికార్డు ప్రకారం ఆ భూముల సర్వేనంబర్ 403/పీ. కానీ పార్థసారథి చూపుతున్న డాక్యుమెంట్లలో ఉన్నది 403/52/పీ. అసలు రెవెన్యూ రికార్డుల్లో ఈ సర్వేనంబరే లేదు. కానీ ఈ వ్యవహారంలో అధికారులు జోక్యం చేసుకున్నట్టు కనిపించలేదు. దీంతో పార్థసారథి ఆ ఇంజంక్షన్ ఆర్డర్‌తో కొన్నిరోజుల కిందట ఆ భూమిలోకి ప్రవేశించారు. కేసీఆర్ హయాంలో 18 ఎకరాల చుట్టూ రెవెన్యూ అధికారులు నాలుగున్నర ఫీట్ల ఎత్తులో నీలిరంగు రేకుల షీట్స్ వేశారు. కానీ ఆ భూమిలో పార్థసారథి ఎనిమిది ఫీట్ల ఎత్తులో వేరే రంగు షీట్లు వేశారు. గతంలో ప్రభుత్వం వేసిన బ్లూ షీట్లకు తెల్ల రంగు వేశారు. గతంలో కూల్చిన గదిని తిరిగి పునర్నిర్మించారు. మరో రెండు షెడ్లు వేశారు. చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
వెలుగులోకి తీసుకువచ్చిన ‘నమస్తే తెలంగాణ’
దాదాపు 15-20 రోజుల కిందటనే ఈ భూమి కబ్జా అవుతున్న విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. దీంతో అధికారులు హుటాహుటిన వచ్చి అక్కడ ‘ప్రభుత్వ స్థలం’ అంటూ బోర్డు ఏర్పాటుచేయడంతోపాటు రేకుల షీట్స్‌పై ప్రభుత్వ భూమి అని కూడా రాసినట్టు తెలిసింది. కానీ ఒక్కరోజులోనే ఆ బోర్డును తీసివేయడంతోపాటు షీట్స్ మీద ప్రభుత్వ భూమి అని రాసిన దానిని కూడా చెరిపివేశారు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందటనే ‘నమస్తే తెలంగాణ’ జలమండలికి చెందిన 1.20 ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో శుక్రవారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డితోపాటు రెవెన్యూ, హైడ్రా అధికారులు కూడా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించారు. అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నా ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే సాయంత్రానికి అటు జలమండలి, ఇటు రెవెన్యూ అధికారులు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. తమ భూములు కబ్జాకు గురి కాలేదని, అలా వచ్చిన కథనాల్లో వాస్తవంలేదని పేర్కొన్నారు. ఆ భూమి తమ స్వాధీనంలోనే ఉందని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆ భూమిలో భారీ ఎత్తున ప్రైవేటు సెక్యూరిటీని మోహరించారు. సీసీ కెమెరాల నిఘాను పెంచారు. అంటే విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికార యంత్రాంగం ఆ చర్యలు తీసుకోకపోగా… మీడియాను సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటే తెర వెనక ఎంతటి ‘బిగ్’ హస్తం ఉన్నదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.