Fish Distribution | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,434 చెరువుల్లో వాస్తవంగా ఆగస్టులోపు చేపపిల్లలను వదిలాల్సి ఉన్నప్పటికీ వాటిని సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్ల ఎంపిక కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియలో అక్రమాల వల్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరిగింది. అక్టోబర్లో ప్రారంభమై డిసెంబర్ వరకూ కొనసాగడంతో పిల్లల సైజు పెరగక ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని, తమ ఉపాధిపై దెబ్బ పడిందని మత్స్యకారులు వాపోతున్నారు. నాసిరకం చేపపిల్లల పంపిణీ కూడా మరో కారణమని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29 కోట్ల చేపపిల్లలను వదిలినట్టు రికార్డుల్లో చూపినప్పటికీ, వాటిలో సగం కూడా వదల్లేదని ఆరోపిస్తున్నారు.
మత్స్యశాఖ అధికారులు మాత్రం 80 నుంచి 100 ఎంఎం సైజు ఉన్న ఒక్కో చేప పిల్లకు రూ.1.73 చొప్పున ఖర్చుచేసినట్టు లెక్కల్లో చూపారు. నిబంధనల మేరకు చెరువుల్లో చేపపిల్లలను వదిలినప్పుడు వాటిని లెక్కిస్తున్న తీరును వీడియో తీయాలి. ఆ చెరువు మత్స్యకారుల సమక్షంలో చేప పిల్లలను వదలాలి. కానీ, మెజారిటీ నీటివనరుల్లో ఇవేవీ పాటించకుండా పూర్తిస్థాయి బిల్లులు డ్రా చేశారనే విమర్శలతోపాటు ఆ శాఖ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉండటం, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి నుంచే ఎండలు ముదరడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు ఇంకిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్లగొండ, కామారెడ్డి, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్కర్నూల్, సంగారెడ్డి పరిధిలోని 90 శాతం చెరువులు దాదాపు అడుగంటిపోయాయి. ఇది మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం చూపింది.
ముఖ్యంగా చేపల ఎదుగుదల తగ్గడం, వాటికి మారెట్లో సరైన రేటు లభించకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో చేపల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. కానీ, ఈసారి ఆ జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీరు వేగంగా ఇంకిపోవడంతో చేపలు ఎక్కువగా చనిపోగా, మిగిలిన చేపల సైజు పెరుగలేదు. దీంతో తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతి కోసం గత సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పాటైన 2014-15లో ఆక్వా కల్చర్, జీఎస్డీపీ భాగస్వామ్యం రూ.2,670 కోట్లు ఉండగా ఆ తర్వాత ఏడాది నుంచి వరుసగా రూ.2,649కోట్లు, రూ.2,275 కోట్లు, రూ.3,654 కోట్లు, రూ.4,042 కోట్లు, రూ.4,694 కోట్లు, రూ.5,254కోట్లుగా నమోదైంది. 2016-17లో ఉచిత చేపపిల్లల పంపిణీ, 2017-18లో రొయ్యపిల్లల పంపిణీ ప్రారంభించగా సత్ఫలితాలిచ్చాయి.