హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మత్స్యశాఖ రెండున్నరేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ శాఖకు రాష్ట్ర సర్కార్ ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం నిర్దేశించుకున్న స్థాయిలో అమలు కావడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది అరకొరగా చేప పిల్లలను పంపిణీ చేయగా, రెండో ఏడాది కూడా ఆశించిన స్థాయిలో పంపిణీ జరుగలేదు. దీంతో రెండేండ్లుగా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా మత్స్యకారుల అభ్యున్నతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారని భావించిన వారికి నిరాశే మిగిలింది. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి కీలకమైన ఈ పథకానికి ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో కేవలం రూ.16 కోట్లు మాత్రమే కేటాయించడంపై మత్స్యసహకార సంఘాలు మండిపడుతున్నాయి.
ఏటా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలను పూర్తిస్థాయిలో చేపట్టాలంటే సుమారు రూ.150 కోట్ల వరకు అవసరమవుతాయి. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులు చూస్తే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొన్నదని మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. చేప పిల్లల కొనుగోలు, రవాణా, చెరువుల్లో వదిలే ప్రక్రియ కోసం అవసరమైన నిధులు లేకపోవడంతో చివరి నిమిషంలో బీసీ సంక్షేమశాఖ నుంచి నిధులు మళ్లించారని మత్స్య సహకార సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. ఇలా ఇతర శాఖల నుంచి నిధులు మళ్లించడం వల్ల నిర్దేశించిన సమయం కంటే ఆలస్యంతో చేప పిల్లల పంపిణీ జరగడం, వాటి పెరుగదలపై గణనీయమైన ప్రతికూలత చూపుతున్నదని పేర్కొంటున్నారు.
ఏటా 90 కోట్ల చేపపిల్లలు అవసరం
రాష్ట్రవ్యాప్తంగా ఏటా 90 కోట్ల వరకు చేపపిల్లలు అవసరమవుతాయి. వాటి కొనుగోలు మాత్రమే కాకుండా, చెరువుల వరకు తరలించేందుకు నిధులు ఖర్చవుతాయి. నిధుల కొరతతో చేపపిల్లల పంపిణీ ఆలస్యమైతే దాని ప్రభావం తమ బతుకులపై ప్రభావం చూపుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించినప్పటికీ .. అమలు విషయంలో ఇతర పద్దుల నుంచి తీసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయంపై మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.