Fish Prasadam | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వచ్చేనెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ జరగనున్నది. మృగశిర కార్తె రోజు ఆస్తమా బాధితులకు ఆయుర్వేద పద్ధతిలో బత్తిని కుటుంబం తరతరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వేలాదిమంది ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు భారీగా తరలివస్తుంటారు. ఈ సందర్భంగా మంగళవారం బత్తిని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఈసారి సుమారు 5నుంచి 6 లక్షలమంది చేప ప్రసాదం తీసుకుంటారని అంచనా వేసినట్టు తెలిపారు.
ఇందుకోసం అన్ని ఏర్పాట్టు చేసినట్లు పేర్కొన్నారు. చేప ప్రసాదం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున వస్తారని తెలిపారు. ఇది ఒక సంప్రదాయంగా వస్తున్న చికిత్సా పద్ధతి అని అన్నారు. ఈ ప్రసాదం తీసుకునే వ్యక్తులు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. రోగుల సౌకర్యార్ధం క్యూలైన్లు, నీటి సదుపాయం, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. కాగా, జూన్ 8,9 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.