హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక కేసుల్లో బాధితుల వద్దకే పోలీసింగ్ వ్యవస్థను తీసుకెళ్లాలని తెలంగాణ సీఐడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. బాధితులకు మరింత చేరువై మానవీయ కోణంలో సేవలందించేందుకు దేశంలోనే తొలిసారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఐడీ డీజీ చారుసిన్హా మంగళవారం వెల్లడించారు. దీంతో పోలీసులే బాధితుల నివాసానికి లేదా వారు కోరిన ప్రదేశానికి వెళ్లి ఎఫ్ఎఆర్ నమోదు చేస్తారని తెలిపారు. నేరం జరిగినప్పుడు బాధితులు ఫోన్ ద్వారా లేదా మౌఖికంగా సమాచారం అందిస్తే చాలని, ఆ వెంటనే సంబంధిత పోలీస్ అధికారి ఘటనా స్థలానికి/బాధితుల నివాసానికి లేదా వారు చికిత్స పొందుతున్న దవాఖానకు చేరుకుని అక్కడే ఫిర్యాదు స్వీకరిస్తారని, అనంతరం ఆ ఫిర్యాదును పోలీస్ స్టేషన్కు పంపి కేసు నమోదు చేయడంతోపాటు రిజిస్టరైన ఎఫ్ఐఆర్ ప్రతిని బాధితులకు వారి ఇంటి వద్దే అందజేస్తారని వివరించారు. ఈ విధానం వల్ల దర్యాప్తులో జాప్యం తగ్గుతుందని, సా క్ష్యాధారాలు తారుమారు కాకుండా చూడొచ్చని చెప్పారు. మహిళలు, పిల్లలు, ఎస్సీ/ఎస్టీలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, బాల్య వివాహాలు, ఆస్తి వివాదాలు, ర్యా గింగ్ కేసుల్లో బాధితులకు తక్షణ ఊరట కల్పించేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు. అన్ని పోలీస్ యూనిట్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ నూతన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని పాటించాలని, బాధితులకు న్యాయమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని చారుసిన్హా స్పష్టం చేశారు.