ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 12: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-కన్సార్షియం ఆఫ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్(యూజీసీ-సీఈసీ) ఆధ్వర్యంలో 16వ అంతర్జాతీయ ప్రకృతి ఫిల్మ్ ఫెస్టివల్ కోసం నిర్వహించిన లఘుచిత్ర పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్(ఈఎంఆర్సీ) సత్తాచాటింది. ములుగు, భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతాల్లోని గొత్తికోయ విద్యార్థుల స్థితిగతులపై ఈఎంఆర్సీ డైరెక్టర్ పీ రఘుపతి రూపొందించిన లఘుచిత్రం ‘రీచింగ్ ది అన్రీచ్డ్’ అభివృద్ధి విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మానవ హక్కుల విభాగంలోనూ సైటేషన్కు ఎంపికైంది. త్వరలో జరిగే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో రఘుపతి ఈ అవార్డు అందుకోనున్నారు. ప్రతీ రోజూ ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో ప్రయాణించి, చిన్నారులకు విద్యతో పాటు బయటి సమాజాన్ని పరిచయం చేసేందుకు వలంటీర్లు చేస్తున్న కృషిని ఈఎంఆర్సీ డాక్యుమెంటరీగా మలిచింది. లఘుచిత్ర రూపకర్త రఘుపతిని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఇన్చార్జి వీసీ దానకిశోర్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, యూజీసీ డీన్ ప్రొఫెసర్ జీ మల్లేశం తదితరులు అభినందించారు.