హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 7 నుంచి ఒం టిగంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యా హ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే 18 గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్కదానినైనా చూపి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని తెలిపారు. హైదరాబాద్‌లోని ఏసీ గార్డెన్స్‌లోని ఎస్ఈసీ
కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పోలింగ్ వివరాలు వెల్లడించారు.
తొలి విడత 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 12,960 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని, 56,19,430 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామని, స్లిప్పులు అందని దూర ప్రాంతాలకు వెళ్లిన వ్యక్తులు టీ-పోల్ మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్ పొందవచ్చని చెప్పారు. పోలింగ్ కేంద్రం ఎక్కడున్నదో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. సిగ్నల్ లేని ప్రాంతాలు మినహా అన్ని స్టేషన్ల నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఒక్క మానిటర్‌పై తొమ్మిది పోలింగ్స్టేషన్లను చూడవచ్చని, 31 జిల్లాల్లో అన్ని పోలింగ్స్టేషన్లను 15 నిమిషాల్లోనే పర్యవేక్షించే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఒక్క సర్పంచ్ స్థానానికి ముగ్గురు పోటీ
తొలివిడతలో 31 జిల్లాల్లో 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయతీలు , 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఎస్ఈసీ కమిషనర్ రాణీకుముదిని చెప్పారు. వీటిలో ఐదు సర్పంచ్ స్థానాలు, 169 వార్డు స్థానాలకు నామినేషన్లు రాలేవని, 396 జీపీలు, 9,633 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. ఒక జీపీ, 10 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశామని వెల్లడించారు. 3,834 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, బరిలో 12,960 మంది నిలిచారని వివరించారు. 27,628 వార్డు స్థానాల్లో 65,455 మంది పోటీలో ఉన్నారని చెప్పారు. 56,19,430 మంది ఓటర్లలో పురుషులు 27,41,070, మహిళలు 28,78,159 , ఇతరులు 201 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,37,089 మంది అధికంగా ఉన్నారని చెప్పారు. తొలి విడతలో 39 5, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు.
3,214 కేసులు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద 3,214 కేసులు నమోదు చేసినట్టు ఎస్ఈసీ కమిషనర్ తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ల కింద 31,428 మందిని బైండోవర్ చేశామని, 902 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నట్టు వెల్లడించారు. రూ.1.70 కోట్ల నగదు, రూ.2.84 కోట్ల విలువైన మద్యం, రూ.2.22 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.12.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.64.15 లక్షల విలువైన ఇతర వస్తువులు మొత్తం రూ.7.54 కోట్ల విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. 50 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని, 60 ప్లాటూన్స్ బయటి నుంచి వచ్చాయని తెలిపారు.
అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు
రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ మహేశ్ భగవత్ వెల్లడించారు. స్థానిక పోలీసులతోపాటు బయటి నుంచి ఫోర్స్‌ను రప్పించామని చెప్పారు. ఫారెస్ట్, ఎక్సైజ్ సిబ్బందిని కూడా బందోబస్తులో వినియోగిస్తున్నట్టు తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు రూ.8.2 కోట్ల నగదు, రూ.3.3 కోట్ల విలువైన మద్యం, రూ.2.23 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్త హత్య ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్‌ఈసీతోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయాల నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని 400 పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్‌కాస్టింగ్ నిర్వహించడంలేదని, అక్కడ బందోబస్తులో అధిక పోలీసు సిబ్బందిని ఉంచామని వెల్లడించారు.
ఎంసీసీ ఉల్లంఘనపై పర్యవేక్షణ కమిటీలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) పర్యవేక్షణకు సీఎస్ నేతృత్వంలో, కలెక్టర్ల సారథ్యంలో కమిటీలు పనిచేస్తున్నాయని రాణీ కుముదిని తెలిపారు. సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికి రావా.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అలాంటి వాటి పర్యవేక్షణకు రెండు కమిటీలు ఉన్నాయని చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికలపై స్పందిస్తూ.. ఆయా అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకున్నామని, ఆయా గ్రామాలకు చెందిన ఎవరైనా వచ్చి ప్రలోభపెట్టి ఏకగ్రీవం చేసుకున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, పరిశీలించి రద్దు చేస్తామని చెప్పారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అసలు నామినేషన్లు రాని గ్రామాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. పోలింగ్ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష నిర్వహణపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, తమ దృష్టికి వస్తే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో లేబర్ హాలిడే ప్రకటించామని తెలిపారు.
93,905 మంది పోలింగ్ సిబ్బంది
రాష్ట్రంలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 93,905 మంది సిబ్బందిని నియమించినట్టు ఎస్ఈసీ కమిషనర్ తెలిపారు. 3,591 మంది రిటర్నింగ్ అధికారుల (ఆర్వో)ను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్టు చెప్పారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా 3,461 పోలింగ్ కేంద్రాలను పరిశీలనలో పెట్టినట్టు పేర్కొన్నారు. 45,086 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంలోనే నిలిచిపోయిందని, మద్యం దుకాణాలను సైతం మూసివేయించామని తెలిపారు. 24/7 కాల్ సెంటర్ ఏర్పాటుచేశామని, టోల్‌ఫ్రీ నంబర్ 9240021456 ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వసతులు ఏర్పాటుచేశామని, ఓటర్లు వచ్చి తమకు నచ్చిన వ్యక్తికి ఓటేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్ సృజన, ఎన్నికల కమిషన్ కార్యదర్శి మకరందు పాల్గొన్నారు.
సిబ్బంది పారితోషికంపై నిర్ణయం
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పారితోషికాన్ని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. స్టేజ్-1 రిటర్నింగ్ అధికారికి రూ.3,500, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌కు రూ.2,200, స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్‌కు రూ.2,000, మైక్రో అబ్జర్వర్‌కు రూ.2,000 పారితోషికం ఇవ్వనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రేట్లు నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: డీజీపీ
తొలి విడుతలో జరుగనున్న 3వేల సర్పంచ్, 3వేల వార్డుసభ్యుల స్థానాల ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టిపెట్టామని పేర్కొన్నారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, టీజీపీఎస్సీ పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు. ఎైక్సెజ్, అటవీశాఖ సిబ్బందికి సైతం ఎన్నికల విధులు అప్పగించామని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్లను సాధారణ, సమస్యాత్మకమైనవిగా విభజించి తదనుగుణంగా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రూ.8.20 కోట్లు స్వాధీనం
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ తనిఖీల్లో రూ.8.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 229 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశామని ప్రకటించారు. 1,053 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామని పేర్కొన్నారు. లైసెన్స్డ్ మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 54 చెక్‌పోస్టుల్లో పక్కా నిఘా పెట్టామని.. అక్రమ మద్యం, నగదు సరఫరాకు అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు.
8పోలింగ్ కేంద్రానికి తెప్ప ప్రయాణం
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పలు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పోలింగ్ సిబ్బంది తెప్ప సాయంతో వాగు దాటాల్సి వచ్చింది. గురువారం పంచాయతీ మొదటి విడుత పోలింగ్ సందర్భంగా కేంద్రాలకు చేరుకోవడానికి ఎన్నికల అధికారులు బుధవారం శెట్పల్లి గ్రామం వద్ద కడెం వాగుపైనుంచి తెప్పమీద యాపల్‌గూడ, రాంనగర్, దోందారిలోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ పేపర్లకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.