హైదరాబాద్, నవంబర్ 3 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలయ్యాయి. 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉంటాయని నోటిఫికేషన్లో ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 రిజర్వుడ్ స్థానాలతోపాటు మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నట్టు పేర్కొంది. రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్వో (ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. పోటీచేసే అభ్యర్థులకు సువిధ యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.