కుత్బుల్లాపూర్, ఆగస్టు 28: తుపాకీతో గాల్లో కాల్పులు జరిపిన ఘటన అర్ధరాత్రి గాజులరామారంలో సంచలనం సృష్టించింది. పెట్రోల్ చోరీ ఘటన ఇరువర్గాల బాహాబాహికి కారణమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన కొడుకు, మహిళతో కలిసి నిజాంపేట్ నుంచి గాజులరామారం వైపునకు మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. మధ్యలో గాజులరామారం ఎల్ఎన్ బార్ వద్దకు రాగానే బైక్‌లో పెట్రోల్ అయిపోయింది. దీంతో రోడ్డుపక్కనే పార్క్ చేసి ఉన్న మరో బైక్ నుంచి పెట్రోల్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా బార్ సిబ్బంది చూసి దొంగలు అనుకొని వారించారు. అంతేకాకుండా బార్ సిబ్బంది ద్విచక్రవాహనదారుడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో సదరు మహిళ తనకు తెలిసిన మల్లంపేట్‌కు చెందిన నరేశ్‌కు ఫోన్ చేయగా హుటాహుటిన తన అనుచరులతో కలిసి కారులో ఎల్ఎన్ బార్ వద్దకు వచ్చాడు. బార్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో ఇరువర్గాలు బాహాబాహీకి పాల్పడ్డాయి. దీంతో నరేశ్ తన కారులో ఉన్న తుపాకీని తీసి గాల్లో మూడు రౌండ్లు కాల్చడంతో అక్కడి నుంచి అందరూ పరారయ్యారు. బార్లో పని చేసే జగద్గిరిగుట్టకు చెందిన అఖిలేశ్ బుధవారం నరేశ్‌తోపాటు ఇతర వ్యక్తులపై జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.