కేసముద్రం, ఏప్రిల్ 26 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ఐదుగురు రైతులకు చెందిన 15 ఎకరాల మక్కజొన్న పంటలు కాలిబూడిదయ్యాయి. రైతులు దొంతరబొయిన కొమురయ్య, సురేశ్, ఐలయ్య, పుణ్యపుర్తి ఐలయ్య మక్కజొన్న సాగుచేశారు. ఎకరానికి రూ.55 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. పంట చేతికి అందడంతో కోయించి చేనులోనే కుప్పగా పోశారు.
ఎండల ధాటికి ఆదివారం మధ్యాహ్నం నిప్పు అంటుకోవడంతో స్థానికులు మంటలు ఆర్పే యత్నంచేసినా అదుపులోకిరాలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి నష్టం జరిగిపోయింది. ఎకరానికి 40 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని బాధిత రైతులు తెలిపారు. రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. షార్ట్‌సర్క్యూట్ వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని పలువురు భావిస్తున్నారు.