హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తేతెలంగాణ): మానవ తప్పిదాలతోనే అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో జీవపరిణామ వ్యవస్థకు భంగం కలిగే ప్రమాదం ఉన్నదని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఐజీ ఎస్ రాజేశ్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ పేర్కొన్నారు.‘అటవీ అగ్నిప్రమాదాలు-నివారణ చర్యలు-వినియోగించే పరికరాలు’ అనే అంశంపై సదస్సును హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ ఐజీ నరేంద్రసింగ్ బుందేల, ఐఐఎఫ్ఎం డైరెక్టర్ రవిచంద్రన్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్తో కలిసి రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ సదస్సును గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డోబ్రియల్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలతో కర్బన ఉద్గారాలు గాలిలో కలిసి మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. కేంద్ర అటవీ శాఖ ఐజీ రాజేశ్ మాట్లాడుతూ నిరుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎకువగా అగ్నిప్రమాదాలు జరిగాయని తెలిపారు. అటవీశాఖతో కలిసి పనిచేసి అగ్నిప్రమాదాల నియంత్రణకు తమవంతు కృషిచేస్తామని నరేంద్రసింగ్ పేర్కొన్నారు. అనంతరం కన్జర్వేటీవ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి మాధవరావు రాసిన ‘ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ ఇన్ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ఆవిషరించారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.