జనవరి 19.. సికింద్రాబాద్‌లోని దక్కన్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంట్రోల్ రూమ్‌కు కాల్ రాగానే, ఫైర్ సిబ్బంది వాహనాలతో బయలుదేరారు. టెర్రస్‌పై ముగ్గురు ఉన్నారని తెలియడంతో.. పెద్ద కేజ్ కలిగిన వాహనంతో ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. 5వ ఫ్లోర్లో వెనుకవైపు ఇంకొక వ్యక్తి ఆర్తనాదాలు వినిపించడంతో.. పక్క బిల్డింగ్ నుంచి నిచ్చెనలు వేయించి లోపలున్న వ్యక్తిని కాపాడారు. మొదటి అంతస్థులో ఇద్దరు ఉన్నారని తెలుసుకొని కిందికి వస్తుండగా రెండో ఫ్లోర్లో ఒక్కసారిగా ఫైర్ బ్లాస్ట్ అయ్యింది. దురదృష్టవశాత్తూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఫైర్ సిబ్బంది అక్కడినుంచి తప్పించుకోగలిగారు.
మార్చి 16: రాత్రి 7 .20 నిమిషాలు.. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు..7.31కి ఫైర్ స్టేషన్‌కు కాల్. ప్రమాద తీవ్రత తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఐదు వాహనాలతో ప్రమాదస్థలికి చేరుకొన్నారు. బ్రోంటో స్కైలిఫ్ట్ ద్వారా 5వ అంతస్థులో ఉన్న ఐదుగురిని రక్షించారు. టెర్రస్నుంచి మరో ఐదుగురిని, 4వ అంతస్థు నుంచి ఇద్దరిని ప్రాణాలకు తెగించి కాపాడారు. మరో ఆరుగురి ఆచూకీ కోసం మళ్లీ ఐదో అంతస్థుకు వెళ్లారు. అపస్మారకస్థితిలో ఉన్నవారిని గుర్తించారు. సీపీఆర్ చేస్తూనే అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. అయితే, చివరగా రక్షించిన ఆరుగురి కథ విషాదాంతమైంది.
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): విపత్తు ఏదైనా ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ విభాగం (డీఆర్ఎఫ్ఎస్) పనిచేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక సేవలశాఖ ఆధ్వర్యంలో దాదాపు 3 వేలమంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 137 అగ్నిమాపక కేంద్రాలు, 415 అగ్నిమాపక వాహనాలు ఉన్నాయి. ఈ శాఖకోసం 2014 నుంచి 2022 వరకు తెలంగాణ సర్కారు దాదాపు 68.61 కోట్లు మంజూరు చేసింది. వీటితో డీఆర్ఎఫ్ఎస్ అత్యాధునిక వాహనాలు, సామగ్రిని సమకూర్చుకొన్నది. ప్రభుత్వ తోడ్పాటుతో సేవలు విస్తృతం చేసింది.
2014 నుంచి 2022 నవంబర్ వరకు ఫైర్ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి 5,368 మందిని కాపాడారు. సుమారు రూ.11,804.21 కోట్ల ఆస్తులను రక్షించారు. 2022లోనే సుమారు రూ.5,635 కోట్ల ప్రజల ఆస్తులను కాపాడగలిగారు. ఇప్పటి వరకూ డీఆర్ఎఫ్ఎస్ సుమారు 40వేల అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పాఠశాలలు/ దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాలు, కర్మాగారాలు, పరిశ్రమల్లో 920 మాక్‌డ్రిల్స్‌తో ప్రమాదాలు, విపత్తులపై అవగాహన కల్పించింది. 2,643 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, జాగ్రత్తలు పాటించని ఆయా యజమానులపై చర్యలు తీసుకొన్నది.