Gulzar House | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద సహాయ చర్యల్లో ప్రభుత్వం, అధికారుల అలసత్వం కారణంగా మృతుల సంఖ్య పెరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్కాల్ రావడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో గాయపడ్డవారు, స్పృహకోల్పోయిన వాళ్లున్నారు. అలాంటి వారికి ఆక్సిజన్ అందించాల్సిన అత్యవసర పరిస్థితి ఉంటుంది. కానీ ఫైర్ సిబ్బంది బయటకు తీసుకొచ్చిన బాధితులను తరలించేందుకు అక్కడ సరిపడా అంబులెన్స్‌లు లేకపోవడంతో స్థానికులు ఆటోలు, కార్లలో దవాఖానలకు తరలించారు.
దవాఖానకు తరలించే సమయంలో ప్రాణాపాయం తప్పాలంటే మార్గం మధ్యలో ఆక్సిజన్ అందించాల్సిన ప్రాధాన్యతను కొందరు సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద స్థలంలో అప్పటికే కొందరు కాలిన గాయాలతో స్పృహ కోల్పోయారు. అంబులెన్స్‌లు వస్తే, ఆక్సిజన్ అందితే వారిలో కొందరిని బతికించే అవకాశం ఉండేదని బాధితుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అగ్నిప్రమాదం జరిగితే కనీసం సహాయ చర్యలు కూడా చేపట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అంబులెన్స్‌లు సమయానికి రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని నెటిజన్లు మండిపడుతున్నారు.