హైదరాబాద్ ఏప్రిల్ 28: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంట్ (వైటీపీఎస్)లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 800 మెగావాట్ల మొదటి యూనిట్‌లోని బాయిలర్ వద్ద గ్యాస్కెట్ ఒత్తిడికి గురై ఆయిల్ లీకేజీ కావడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. బాయిలర్ వద్ద సుమారు 30 మీటర్ల పరిధిలోని కమ్యూనికేషన్ కేబుళ్లు, పైపులు తదితర సామగ్రి కాలిపోయాయి. ప్లాంట్‌లోని అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
మొదటి యూనిట్ ఇప్పటికే పనులు పూర్తి చేసుకొని ట్రయల్ రన్‌కు సిద్ధంగా ఉన్నది. మూడు రోజులపాటు నిరంతరాయంగా 800 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు సీవోడీ పూర్తికావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకున్నది. ఆదివారం కావడం, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్లాంటును పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌లోని మొదటి యూనిట్ బాయిలర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదానికి పర్యవేక్షణ లోపమే కారణమన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంధనం లీకేజీతోనే ప్రమాదం జరిగిందని, స్వల్ప నష్టం జరిగిందని, మొదటి ప్లాంట్ నిర్మాణపు పనులు పూర్తి కాలేదని, ఇంకా బీహెచ్ఈఎల్ ఆధీనంలో పనులు కొనసాగుతున్నాయని టీజీ జెన్కో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సచివాలయంలో జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా, బీహెచ్ఈఎల్ సీఎండీ సదాశివమూర్తిలతోపాటు వైటీపీఎస్ ఇంజినీర్లతో సమీక్షించారు. వారం రోజుల్లో మరమ్మతులు చేపడతామని బీహెచ్ఈఎల్ అధికారులు తెలిపారు.